
రేషన్ పంపిణీలో అక్రమాలు సహించం
● జూన్ నుంచి రేషన్ దుకాణాల వద్దే
సరుకుల పంపిణీ
● కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రశాంతి నిలయం: రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలను సహించబోమని కలెక్టర్ చేతన్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ అధికారులు, డీలర్లను హెచ్చరించారు. శుక్రవారం ఆయన జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలసి కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పౌరసరఫరాల శాఖ సీఎస్‌డీటీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 1,367 రేషన్ దుకాణాలున్నాయని, ఆయా దుకాణాల పరిధిలోని కార్డుదారులందరికీ రేషన్ సరుకులు పంపిణీ పక్కాగా జరగాలన్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల వద్దే నిత్యావసరాలు పంపిణీ జరుగుతుందన్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుండీ 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి రేషన్ దుకాణం వద్ద ధరల పట్టిక, సరుకుల నిల్వలను సూచించే బోర్డులు తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, జిల్లాలోని పలువురు సీఎస్‌డీటీలు పాల్గొన్నారు.
పారిశ్రామిక ప్రగతితోనే యువతకు ఉపాధి
పారిశ్రామిక ప్రగతితోనే యువతకు ఉపాధి కల్పన సాధ్యమవుతుందని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో పరిశ్రమల స్థాపన, సోలార్ ప్రాజెక్ట్ భూసేకరణ అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటు, సోలార్ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూసేకరణను వెంటనే చేపట్టాలన్నారు. జిల్లాలో 7,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు 35 వేల ఎకరాలు అవసరం కాగా, మడకశిర ప్రాంతంలో 25 వేల ఎకరాలు గుర్తించామన్నారు. భూసేకరణకు గ్రామ సభలు నిర్వహించాలన్నారు. రైతుల భూములు సేకరించాల్సిన చోట వారికి అవగాహన కల్పించి... అనుమతులను నివేదిక రూపంలో జూన్ 15వ తేదీలోపు సమర్పించాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పుట్టపర్తి, పెనుకొండ, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, ఆనంద్‌కుమార్, శర్మ, మహేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ల్యాండ్ సర్వే ఏడీఈ విజయశాంతి బాయి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, సోలార్ ప్రాజెక్ట్ పీడీ శివశంకర్ నాయుడు, వివిధ మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.