
అదృశ్యమైన మహిళలు ఉరవకొండలో ప్రత్యక్షం
ఉరవకొండ: కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్‌లో ఉన్న ఉజ్వల హోం నుంచి ఈనెల 22న అదృశ్యమైన ఇద్దరు మహిళల ఆచూకీ లభించింది. ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది వివరాల మేరకు.. కుందుర్పి, కణేకల్లు మండలాలకు చెందిన యువతులు కళ్యాణదుర్గంలోని ఉజ్వల హోం నుంచి అదృశ్యమైనట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశామన్నారు. ఉరవకొండ బస్టాండ్‌లో వారిని స్థానికులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే వారిని కళ్యాణదుర్గం పోలీసులకు అప్పగించామన్నారు.
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
విడపనకల్లు: మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోని 67వ జాతీయ రహదారిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఈరన్న (42) మృతి చెందాడు. కర్ణాటకలోని కంప్లీ నుంచి గుంతకల్లు వైపు వెళ్తున్న లారీ మండల పరిధిలోని హంచనహాల్ సమీపంలోకి రాగానే టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ లారీని ఆపీ టైరు కింద రాళ్ళను పెట్టేందుకు వెనుక వైపునకు వెళ్ళాడు. అదే సమయంలో గుంతకల్లు వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా వచ్చి పంక్చరైన లారీని ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్ ఈరన్న అక్కడికక్కడే చనిపోయాడు. విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కమీషన్ల కక్కుర్తికి బాలుడి ప్రాణాలు బలి
● బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలని సీపీఐ నేత జగదీష్ డిమాండ్
గుంతకల్లు: నాసిరకం నిర్మాణ పనులతో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డీ.జగదీష్ విమర్శించారు. శుక్రవారం గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో పెచ్చులూడి పడి మణికంఠ అనే బాలుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం నాయకుల బృందం వేర్వురుగా స్థానిక రైల్వేస్టేషన్‌లోని 6–7 నంబర్లు ప్లాట్‌ఫారాల్లో ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం సీపీఐ నేత జగదీష్ విలేకరులతో మాట్లాడారు. గుంతకల్లు రైల్వేస్టేషన్‌ను రూ.కోట్ల ఖర్చుతో ఆధునీకరించారన్నారు. రైల్వే అధికారులు కమీషన్లు, పర్సంటేజీలకు కక్కుర్తిపడి నాసిరకం నిర్మాణాలను పట్టించుకోలేదన్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్ట్‌రును బ్లాక్‌లిస్ట్ పెట్టడంతో పాటు సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మణికంఠ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి రైల్వే ఉద్యోగమిచ్చి ఆదుకోవాలన్నారు. అంతకుముందు సీపీఐ నాయకుల బృందాన్ని రైల్వేస్టేషన్‌లోకి వెళ్లాకుండా ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆర్‌పీఎఫ్‌పై అధికారి అనుమతితో వారిని స్టేషన్‌లోపలికి అనుమతి ఇచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు గోవిందు, వీరభద్రస్వామి, మహేష్, గోపీనాథ్, రామురాయల్, ఎస్‌ఎండీ గౌస్ పాల్గొన్నారు.
ఎలుగు దాడిలో వ్యక్తికి గాయాలు
కళ్యాణదుర్గం రూరల్: ఎలుగు బంటి దాడిలో వ్యక్తి గాయపడిన సంఘటన శుక్రవారం జరిగింది. మండల పరిధిలోని మోరేపల్లికి చెందిన బాలరాయుడు తెల్లవారుజామున బహిర్బూమికి వెళ్లిన సమయంలో ఎలుగు బంటి దాడిచేసింది. ఆయన కేకలు వేయటంతో ఎలుగు బంటి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది. గాయపడిన బాలరాయుడు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అదృశ్యమైన మహిళలు ఉరవకొండలో ప్రత్యక్షం