
వివాహిత ఆత్మహత్యాయత్నం
అనంతపురం మెడికల్/కదిరి అర్బన్: కదిరి పట్టణానికి చెందిన యషిక సూపర్ వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చేర్పించారు. యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ వివరాల మేరకు.. కదిరికి చెందిన లక్ష్మీనారాయణ, శిరీష దంపతుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో శిరీషకు సంబంధించి ఫొటోలను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై యషిక, ఆమె తండ్రి లక్ష్మీనారాయణ తదితరులను పోలీసుస్టేషన్‌కు రావాలని పిలుపుస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం యషికకు సీఐ నారాయణరెడ్డి ఫోన్ చేసి దుర్భాషలాడడంతో ఆమె స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ సీఐతో పాటు ఎస్‌ఐ బాబ్జాన్ నానా మాటలు అనడంతో మనస్థాపంతో యషిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీడీపీ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు తమను వేధిస్తున్నారని, శిరీషతో ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదిలా ఉండగా.. తాను తన మిత్రుడితో కలసి ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేశారని శిరీష కదిరి పట్టణ పోలీసులను ఆశ్రయించింది. రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించింది. శిరీష ఫిర్యాదు మేరకు ఆమె భర్త లక్ష్మీనారాయణ, కుమార్తె యషిక, ఆమె భర్త శివ, జగదీష్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సీఐ, ఎస్‌ఐలే కారణమంటున్న బాధితురాలు