
చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య
ధర్మవరం రూరల్: ధర్మవరం పట్టణంలోని శివానగర్‌కు చెందిన ఉడతనపల్లి లలిత (56) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తితో శుక్రవారం ధర్మవరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ సీఐ పి. నాగేంద్రప్రసాద్ వివరాల మేరకు .. మృతురాలు కొంత కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతుండేది. షుగర్ వ్యాధి వల్ల ఆమె కుడి కాలు ఇన్ఫెక్షన్ అయి కాలికి ఉన్న రెండు వేళ్లను తొలగించారు. నొప్పిని భరించలేక మనస్థాపంతో ఇంట్లో నుంచి వెళ్లి చెరువు కట్ట వద్ద ఉన్న శివాలయం సమీపంలో చెరువులోకి దూకి చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఉచిత ఆన్‌లైన్ సహకార
కేంద్రం ఏర్పాటు
ధర్మవరం రూరల్: ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ధర్మవరం పట్టణంలోని స్థానిక యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఉచిత సహకార కేంద్రం ఏర్పాటు చేసినట్లు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వం మొదటిసారిగా ఉపాధ్యాయ బదిలీల చట్టాన్ని తీసుకొచ్చి బదిలీలు చేస్తోందని, బదిలీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ నమోదుకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడానికి యూటీఎఫ్ ధర్మవరం డివిజన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సహకార కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సేవలు అన్ని ఉచితంగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు రామకృష్ణనాయక్, లతాదేవి, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.మేరీ వరకుమారి, ధర్మవరం డివిజన్ నాయకులు ఆంజనేయులు, లక్ష్మయ్య, అమర్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌కు చేరిన
కిడ్నాప్ కథ
తాడిపత్రిటౌన్: పట్టణంలో కేబుల్ ఆపరేటర్ యజమానుల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో గురువారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త యాసిన్‌ను కొందరు టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రెడ్డితో పాటు యాసిన్ తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తనను టీడీపీ నాయకులు ధనుంజయరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, రామాంజులరెడ్డి, బేల్దారి ప్రసాద్ కిడ్నాప్ చేసి రూములో బంధించి ఇసుప పైపులు, కట్టెలతో చావబాదారని, గురువారం రాత్రి సమయంలో వదిలేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకొన్న తనకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స తీసుకొని వచ్చానని పేర్కొన్నారు. డిష్ గొడవలు ఉంటే యజమాన్యాలు చూసుకోవాలి కాని అందులో పనిచేసే తమకు ఏం సంబంధం ఉంటుందని యాషిన్ పోలీసుల ముందు వాపోయారు.