ఉమ్మడి జిల్లాలో చెరువులను పూర్వస్థితికి తేవాలి
అనంతపురం అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 507 చెరువులను పూర్వస్థితికి తేవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణకు కేంద్రం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు వెచ్చిస్తాయని పేర్కొన్నారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులతో జిల్లాస్థాయి అమలు, పర్యవేక్షణ కమిటీ (డీఎల్‌ఐ అండ్ ఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, ప్రభుత్వ నిధులతో శ్రీ సత్యసాయి జిల్లాలో 411 చెరువులు, అనంతపురం జిల్లాలో 96 చెరువులను పూర్వస్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. చెరువులను గుర్తించి పనులకు సంబంధించి ప్రతిపాదనలను రాష్ట్ర కమిటీకి పంపించాలన్నారు. ఇప్పటికే 29 చెరువులను గుర్తించారని, మిగిలిన చెరువులను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పండమేరు పైభాగాన, మరువ వంక, నడిమి వంక పైభాగన ఉన్న చెరువులను కూడా బలోపేతం చేయాలని సూచించారు.
సమావేశంలో మైనర్ ఇరిగేషన్ ఎస్‌ఈ విశ్వనాథరెడ్డి, డ్వామా పీడీ సలీంబాషా, భూగర్భ జల శాఖ డీడీ తిప్పేస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, కేంద్ర భూగర్భజల బోర్డు అధికారి స్వరూప్ కళ్యాణ్, కేంద్రీయ జలసంఘం ఏడీ సీహెచ్ సంజీవ్, మైనర్ ఇరిగేషన్ ఈఈ రాము, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం


