అయ్యప్పస్వామి బంగారు విగ్రహ ప్రతిష్ట
ధర్మవరం అర్బన్: స్థానిక కేశవనగర్‌లో నూతనంగా నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయం ప్రారంభోత్సవంతో పాటు మణికంఠుడి బంగారు విగ్రహన్ని బుధవారం వేదమంత్రాల నడుమ ప్రతిష్టించారు. ఆలయ వ్యవస్థాపకులు, గురుస్వామి పీజే విజయ్‌కుమార్, సభ్యులు బండ్లపల్లి వెంకటజయప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. సాయంత్రం అయ్యప్పస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై కొలువుదీర్చి పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు.
టీడీపీ నేత దౌర్జన్యం
కనగానపల్లి: మండలంలోని కోనాపురం చెరువు కట్ట సమీపంలో దోభీఘాట్ వద్ద పంచాయతీ నిధులతో రజకుల కోసం ఏర్పాటు చేసిన బోరుబావిని స్థానిక టీడీపీ నేత కబ్జా చేశాడు. బోరుబావి నుంచి ప్రత్యేకంగా పైపులు ఏర్పాటు చేసుకుని నీటిని తన పొలానికి మళ్లించుకుంటున్నాడు. దీంతో నీటి సౌకర్యం లేక రజకులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలోనూ ఇదే బోరుబావి నుంచి గ్రామంలోని ఓ రైతు కొన్ని రోజుల పాటు తన పొలానికి నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో అభ్యంతరం తెలిపిన స్థానిక టీడీపీ నాయకులు తిరిగి ఆ పార్టీకి చెందిన వ్యక్తి దౌర్జన్యంగా నీరు మళ్లించుకుంటుంటే ఎందుకు మాట్లాడటం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథ్‌ను వివరణ కోరగా... ఇప్పటికే ఈ విషయంపై ఫిర్యాదులు అందాయని, బోరు కబ్జా చేసిన వ్యక్తికి నోటీసులు అందజేసి పైపులైన్ తొలగిస్తామని పేర్కొన్నారు.
మామిడి చెట్ల నరికివేత
లేపాక్షి: స్థానిక బింగిపల్లి మార్గంలో రైతు ముక్తియార్‌కు చెందిన మామిడి తోటలో 42 చెట్లను మంగళవారం రాత్రి దుండగులు నరికి వేశారు. బాధితుడు తెలిపిన మేరకు... తనకున్న 2.50 ఎకరాల పొలంలో మూడేళ్లుగా మామిడి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపాడు. ఈ ఏడాది కాపు దశకు వచ్చాయన్నారు. బుధవారం ఉదయం తోట వద్దకు చేరుకోగా 175 మామిడి చెట్లలో 42 మామిడి చెట్లను నరికి వేసినట్లుగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. రైతు ఫిర్యాదు మేరకు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
అయ్యప్పస్వామి బంగారు విగ్రహ ప్రతిష్ట
అయ్యప్పస్వామి బంగారు విగ్రహ ప్రతిష్ట


