
కాలువ ఇలా.. నీరు వెళ్లేదెలా?
రొళ్ల: సప్లయ్ చానల్‌ను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వందల ఎకరాలు నిరుపయోగంగా మారాయి. రొళ్ల మండల పరిధిలోని కొడగార్లగుట్ట గ్రామం వద్ద ఉన్న సప్లయ్ చానల్ మట్టి, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దీంతో వర్షపు నీరు చానల్ గుండా వెళ్లడం లేదు. నీళ్లన్నీ కర్ణాటక రాష్ట్రం వైపు వృథాగా వెళ్తున్నాయి. రొళ్ల మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అక్కడ కురిసిన వర్షపు నీరు వృథా కాకూడదనే కొడగార్లగుట్ట సమీపంలో 1996లో రూ.5 లక్షల వ్యయంలో రెండు కిలో మీటర్ల మేర సప్లయ్ చానల్‌తో పాటు కొడగార్లగుట్టకు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశారు. వర్షపు నీరు సప్లయ్ చానల్ గుండా రొళ్ల కొండ వద్ద ఉన్న వంక తర్వాత చెరువుకు చేరేవి. అయితే ఏళ్లుగా మట్టి, పిచ్చి మొక్కలతో నిండిపోవడంతో సప్లయ్ చానల్ అధ్వానంగా తయారైంది. దీంతో రొళ్ల మండలంతో పాటు అగళి మండలంలోని వందలాది ఎకరాల భూములు నిరుపయోగంగా మారాయి. కర్ణాటక వైపు నీళ్లు వెళ్లకుండా సప్లయ్ చానల్ సమీపంలో చెక్‌డ్యాంను కూడా నిర్మించారు. అయితే చెక్‌డ్యాం ఎత్తు పెంచకపోవడంతో వర్షపు నీళ్లు చానల్ గుండా వెళ్లకుండా దిగువ ప్రాంతమైన కర్ణాటక వైపు వెళ్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో రూ.7 లక్షలతో మరమ్మతు పనులు చేసినా చానల్ మళ్లీ మూసుకుపోవడంతో నీళ్లు పారడం లేదు.
నీరు పారక వందల ఎకరాల
ఆయకట్టు నిరుపయోగం
మరమ్మతు పనులు చేపట్టాలి
రొళ్ల చెరువు ఆయకట్టు కింద నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో ప్రస్తుతం వర్షాధారం కింద ఎకరాలో రాగి, ఎకరాలో వేరుశనగ పంటతో పాటు మరో ఎకరాలో ఉలవలు, జొన్నలు సాగు చేశాను. సప్లయ్ చానల్ ద్వారా నీళ్లు మళ్లిస్తే నాలాంటి ఆయకట్టు రైతులందరూ బాగు పడతారు. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – బసవరాజు, రొళ్ల
నీరంతా వృథా అవుతోంది
హొట్టేబెట్ట పంచాయతీ అటవీ ప్రాంతం నుంచి వచ్చే వర్షపునీరు వృథా అవుతున్నాయి. కొడగార్లగుట్ట వద్ద ఉన్న సప్లయ్ చానల్ నిరుపయోగంగా మారడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో సప్లయ్ చానల్ గుండా వర్షపు నీటిని మళ్లించడంతో చెరువు నిండి పంటలు బాగా పండేవి. సప్లయ్ చానల్‌ను బాగు చేసి నీరు పారే విధంగా చర్యలు చేపట్టాలి. – దేవరాజు, అగళి

కాలువ ఇలా.. నీరు వెళ్లేదెలా?

కాలువ ఇలా.. నీరు వెళ్లేదెలా?

కాలువ ఇలా.. నీరు వెళ్లేదెలా?