● ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ దౌర్జన్యం
పెనుకొండ రూరల్: ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల దౌర్జన్యాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. చిన్నపాటి కంతు చెల్లించడంలో జాప్యం చోటు చేసుకోవడంతో ఓ మహిళ ఇంటికి తాళం వేసిన ఘటన పెనుకొండ మండలంలో చోటు చేసుకొంది. వివరాలు.. మండలంలోని కొండంపల్లి గ్రామానికి చెందిన నాగమ్మ... ఫ్యూజిన్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రూ.40 వేల రుణం తీసుకుంది. నిబంధనల మేరకు ప్రతి రెండు వారాలకు ఒకసారి కంతు చెల్లిస్తూ వచ్చారు. ఈ వారం కంతు రూ.వెయ్యి చెల్లించాల్సి ఉండగా డబ్బు సమకూరక ఇబ్బంది పడుతున్న నాగమ్మ తన కుమారుడు వడ్డె అంజితో కలసి ఒక రోజు గడువు ఇవ్వాలని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులను కోరారు. దీనిపై కంపెనీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడుతూ ఇంటి నుంచి బలవంతంగా నాగమ్మను బయటకు పంపి తాళం వేశారు. దీంతో చేసేదేమీ లేక ఇంటి ముందే బాధితులు ఉండిపోయారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై కంపెనీ బ్రాంచ్ మేనేజర్ మంజులను ఫోన్‌లో వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.