కదిరి టౌన్: హోలీ సందర్భంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన అమృతవల్లి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటపతి కటకటాలపాలయ్యారు. అమ్మాయిల పట్ల ప్రిన్సిపాల్ వ్యవహరిస్తున్న తీరును కళాశాల సమీపంలోని మహిళలు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. మహిళా కానిస్టేబుల్ గౌసియా ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్ సెక్షన్ 75 కింద ప్రిన్సిపాల్‌పై శనివారం కదిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆదివారం ప్రిన్సిపాల్ వెంకటపతిని హిందూపురం రోడ్డు కోనేరు సర్కిల్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి, కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా నిందితునికి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో అతడిని సబ్‌జైలుకు తరలించినట్లు సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు.