గుడిబండ: జిల్లాలో తాగునీటి సమస్యలపై రోజుకో ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మండల పరిధిలోని సీసీ గిరి గ్రామంలోని ఎస్సీ కాలనీలోనీ మహిళలు రోడ్డెక్కారు. పీసీ గిరి పంచాయతీ సీసీ గిరి గ్రామం దళితకాలనీలోనీ ప్రజలకు వారం రోజులుగా తాగునీరు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇందులో భాగంగానే గ్రామస్తులు ఖాళీ బిందెలతో కర్ణాటక రాష్ట్రం శిరాకు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నీటి సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు విన్నమించినా స్పందన కరువైందని మహిళలు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ డీఎల్ యంజారేగౌడు, ఈఓఆర్డీ నాగరాజునాయక్, పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని గ్రామ ప్రజలు, మహిళలతో మాట్లాడారు. ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు.