● పాఠశాల విద్య రీజనల్
జాయింట్ డైరెక్టర్ శామ్యూల్
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి జవాబు పత్రాల కోడింగ్‌లో ఏ చిన్న పొరబాటుకు తావివ్వొద్దని పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ సూచించారు. గురువారం అనంతపురంలోని సైన్స్ కేంద్రంలో రాయలసీమ జిల్లాల్లోని కోడింగ్, అసిస్టెంట్ కోడింగ్ ఆఫీసర్లతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ శామ్యూల్ మాట్లాడుతూ కోడింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైందన్నారు. ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదన్నారు. చదివేవాడికి, చదవలేనివాడికి ఒకే విధంగా మార్కులు వచ్చే పొరబాట్లు చేయొద్దన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు కీలకం అన్నారు. రెగ్యులర్ పరీక్షలతో పాటు ఓపెన్ పరీక్షలకు కూడా ఇదే విధంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, కడప డీఈఓలు, 8 జిల్లాల నుంచి ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్లు, 130 మంది కోడింగ్, అసిస్టెంట్ కోడింగ్ అధికారులు హాజరయ్యారు.
476 మంది
విద్యార్థుల గైర్హాజరు
పుట్టపర్తి: జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 పరీక్షలకు 476 మంది గైర్హాజరయ్యారు. ఆర్జేడీ రవీంద్ర ఇంటర్ జిల్లా విద్యాశాఖ అధికారి రఘునాథరెడ్డితో కలిసి హిందూపురంలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. 11,766 మంది జనరల్ విద్యార్థులకు గాను 11,388 మంది విద్యార్థులు హాజరైనట్లు రఘునాథరెడ్డి తెలిపారు. అలాగే ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1156 మంది విద్యార్థులకుగాను 1068 మంది హాజరైనట్లు చెప్పారు. జిల్లా స్పెషలాఫీసర్ చెన్నకేశవప్రసాద్, కమిటీ సభ్యులు సురేష్, రామరాజు, శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ వెంకటేశ్వరప్రసాద్ తదితరులు పరీక్షలను పర్యవేక్షించారు.
‘పది’ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
పుట్టపర్తి టౌన్: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) మదుసూధన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ జరగనున్న పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఒరిజినల్ హాల్ టికెట్ కండెక్టర్‌కు చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారన్నారు. ఈ అవకాశం అన్ని పల్లె వెలుగుల (ఆర్డినరీ) బస్సుల్లో ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.
హోలీ పండుగ
ప్రశాంతంగా జరుపుకోండి
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా ఇతరులకు ఇబ్బందులు కలగకుండా హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న ప్రజలకు సూచించారు. గురువారం ఆమె జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ నేపథ్యంలో జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు, ప్రదేశాలు, కాలనీల్లో రహదారుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఇతర వ్యక్తులకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదన్నారు. ప్రధానంగా మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు తొలగించి పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్లరాదని సూచించారు. వేడుకల్లో పర్యావరణ హితమైన రంగులను వాడాలని కోరారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
కదిరి అర్బన్: మండల పరిధిలోని దిగువపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న ఓబులేసును గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కృష్టప్ప సస్పెండ్ చేశారు. మనబడి – మన భవిష్యత్తుకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
కోడింగ్‌లో పొరబాట్లకు తావివ్వొద్దు