
రైతుల గోడు పట్టదా?
మడకశిర: నియోజకవర్గంలోని మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో దాదాపు 42 వేల మంది రైతులకు చింత చెట్లు ఉన్నాయి. 2 లక్షల వరకు చింత చెట్లు విస్తరించాయి. ఏడాది కొకసారి వచ్చే చింత ఫలసాయం ద్వారా రైతులు ఆర్థికంగా ఊరట చెందేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
రూ.6 కోట్ల నుంచి రూ.2 కోట్లకు..
నియోజకవర్గంలో గరిష్టంగా రూ.6 కోట్ల విలువ చేసే చింతపండు ఉత్పత్తి జరగాల్సి ఉంది. అయితే ఈ ఉత్పత్తి విలువ ప్రతి ఏడాది క్రమేణా తగ్గిపోతోంది. గత ఏడాది కూడా చింతపండు ఉత్పత్తి విలువ మడకశిర నియోజకవర్గంలో రూ.3 కోట్లకు చేరుకోలేదు. ఈ ఏడాది కూడా చింతపండు ఉత్పత్తి భారీగా పడిపోయింది. చింతపండు దిగుబడి నామమాత్రంగానే ఉంది. రూ.2 కోట్లు కూడా ఉత్పత్తి విలువ దాటే పరిస్థితి లేకుండా పోయింది.
ధర బాగున్నా...
ఈఏడాది చింతపండు ధర ఆశాజనకంగానే ఉంది. ప్రారంభం నుంచి చింతపండు ధరలు నిలకడగానే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి రకం (కరిపుళి) చింతపండు గరిష్ట ధర క్వింటాలు రూ.40 వేల వరకూ పలికింది. అలాగే కనిష్ట ధర రూ.8 వేల వరకూ పలికింది. రెండో రకం (ఫ్లవర్) చింతపండు ధర గరిష్టంగా రూ.14 వేల వరకూ పలికింది. కనిష్ట ధర రూ.5 వేలకు దాకా పలికింది. అయినా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాలేదు. ధర ఆశాజనకంగా ఉన్నా కూడా చింతపండు దిగుబడి 50 శాతం తగ్గడంతో రైతులకు నిరాశే మిగిలింది.
పెరిగిన ఉత్పత్తి వ్యయం..
చింతపండు ఉత్పత్తి వ్యయం కూడా పెరగడంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కూలీల ఖర్చులు భారీగా పెరిగాయి. చింతకాయలను చెట్టు నుంచి కోయడానికి గతంలో ఒక మగ కూలీకి రోజుకు రూ.300 కూలీ ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ కూలీ రూ.800కు పెరిగింది. అదే విధంగా చెట్టు నుంచి కోసిన చింత కాయలు నేలపై పడతాయి. ఆ కాయలను ఏరడానికి గతంలో ఒక ఆడ కూలీకి రోజుకు రూ.100 చెల్లించే వారు. ప్రస్తుతం అది రూ.400 అయింది. చింతకాయల నుంచి చింతపండును శుద్ధి చేయడానికి రోజుకు ఓ ఆడ కూలీకి గతంలో రూ.150 చెల్లించే వారు ప్రస్తుతం రూ.400 పెరిగింది. గతానికి భిన్నంగా కూలీలకు భోజన సౌకర్యం కూడా కల్పించాల్సి వస్తోంది. కూలీల ఖర్చు పెరగడం కూడా చింతపండు రైతులకు భారంగా మారింది.
మార్కెట్ సౌకర్యం కరువు..
జిల్లాలో మడకశిర నియోజకవర్గంలోనే 90 శాతం చింతపండును రైతులు పండిస్తున్నారు. మడకశిరకు ఆనుకుని ఉన్న సరిహద్దులోని కర్ణాటకకు చెందిన పావగడ, శిర, హిరియూర్, మధుగిరి, చళ్లకెర నియోజకవర్గాల్లో కూడా చింతపండు ఉత్పత్తి ఎక్కువగా ఉంది. అయినా మడకశిరలో చింతపండు మార్కెట్ లేదు. మడకశిర ప్రాంతం రైతులు చింతపండును హిందూపురం, శిర మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. మడకశిరలో చింతపండు మార్కెట్ ఏర్పాటు చేయకపోవడం కూడా రైతులకు ఇబ్బందికరంగా మారింది. చింతపండు ఉత్పత్తిపై రైతులకు ఆసక్తి తగ్గేందుకు ఇది కూడా ఓ కారణంగా మారింది.
చింతచెట్లను తొలగిస్తున్న రైతులు..
నియోజకవర్గంలో కొందరు రైతులు చింతచెట్లను ఇప్పటికే తొలగించారు. ఆశించిన స్థాయిలో రైతులకు ఆదాయం రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చింతకట్టెలను ఇటుక బట్టీల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో చింత కట్టెలకు అధిక డిమాండ్ ఉంది. చింతచెట్లను తొలగించడానికి ఆదాయం తగ్గడం ఒక కారణమైతే....చింతచెట్లు ఉన్న భూమి వ్యవసాయం చేసుకోవడానికి పనికి రాదు. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయ యోగ్యమైన భూమిలో ఉన్న చింతచెట్లను తొలగించి వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అమరాపురం, గుడిబండ, మడకశిర తదితర మండలాల్లో చింతచెట్లను తొలగించారు. ఇటుక బట్టీల నిర్వాహకులు చింతచెట్లను గ్రామాలకే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
చింతపండు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్థానికంగా మార్కెట్ సౌకర్యం కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మడకశిరలోనే మార్కెట్ సౌకర్యం కల్పించాలి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్థానికంగానే మార్కెట్ సౌకర్యం కల్పించడానికి చొరవ తీసుకోవాలి. చింతపండు రైతులు నష్టపోతే నష్టరరిహారం చెల్లించడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. – హనుమంతరాయప్ప, అగళి

రైతుల గోడు పట్టదా?