కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు మంగళవారం రాత్రి వీణాపాణిగా హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించి తిరువీధుల్లో ఊరేగుతున్న శ్రీవారి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని భక్తజనం తన్మయత్వం చెందారు. నారసింహుడు హంస వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతిని కల్గిస్తాడని అర్చక పండితులు తెలిపారు. పరమాత్మ వేదోపదేశాన్ని హంస రూపంలోనే చేసినందున తుచ్ఛమైన కోర్కెల అంధకారం వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తిమార్గం వైపు నడవాలని ఈ హంసవాహనం ద్వారా స్వామివారు తన భక్తులకు చాటిచెబుతారని అర్చకులు వెల్లడించారు. ఉభయదారులుగా పట్టణానికి చెందిన తోటంశెట్టి రాజుగోపాల్‌శెట్టి కుటుంబీకులు వ్యవహరించారని ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా,బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాటమరాయుడు బుధవారం మాడవీధుల్లో సింహవాహనంపై దర్శనమివ్వనున్నారు.