పెట్టుబడి కూడా అందలేదు | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి కూడా అందలేదు

Mar 11 2025 12:09 AM | Updated on Mar 11 2025 12:09 AM

పెట్ట

పెట్టుబడి కూడా అందలేదు

కక్కలపల్లి టమాట మండీలో కొనసాగుతున్న క్రయవిక్రయాలు

అనంతపురం అగ్రికల్చర్‌: టమాటను నమ్ముకున్న రైతులు ఈ సారి కూడా భారీగా నష్టాలు మూటకట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో ఏకంగా ఖరీఫ్‌, రబీలో ఈ ఏడాది 45 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో టమాట సాగులోకి వచ్చింది. ఈ సారి 8 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా దిగుబడిని రైతులు సాధించారు. టన్ను సరాసరి కనిష్టంగా రూ.15 వేలు ప్రకారం అమ్ముడుబోయినా ఈ సారి రూ.1,200 కోట్ల మేర టర్నోవర్‌ ఉండేదని అంచనా. కానీ మార్కెట్‌ హెచ్చుతగ్గుల కారణంగా 80 శాతం మంది రైతులు భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. రారష్ట్‌ర వ్యాప్తంగా 26 జిల్లాల పరిధిలో అనంతపురం జిల్లాలో 45 వేల ఎకరాల టమాట సాగులో మొదటి స్థానంలో ఉండగా... 22 వేల ఎకరాలతో శ్రీసత్యసాయి జిల్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. ఆ తర్వాత అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాలు ఉన్నాయి.

నాలుగు నెలలుగా పతనావస్థలో..

సీజన్‌ ఆరంభమైన జూలై నుంచి అనంతపురం సమీపంలో ఉన్న కక్కలపల్లి మండీలో టమాట అమ్మకాలు మొదలయ్యాయి. మొదట్లో పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో రైతులు టమాట సాగుపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఫలితంగా సెప్టెంబర్‌ నుంచి పంట దిగుబడులు, మార్కెట్‌కు సరుకు రావడం పెరిగింది. ధర కొంచెం బాగున్నప్పుడు మధ్య మధ్యలో వర్షాలు రావడంతో పంట తడిసిందని, మచ్చ ఉందంటూ మండీ నిర్వాహకులు, వ్యాపారులు ‘నో సేల్‌’ పెట్టడంతో చాలా మంది రైతులకు అసలుకే మోసపోయారు. ఇలా డిసెంబర్‌ వరకు టమాట అమ్ముడుపోక కొందరు రైతులు తల్లడిల్లిపోయారు. ఇక డిసెంబర్‌ నుంచి మార్కెట్‌ పూర్తిగా పతనమైంది. గరిష్ట ధర రూ.10, కనిష్టం రూ.5, సరాసరి రూ.7 చొప్పున గత మూడు నెలలుగా మార్కెట్‌లో ధరలు కొనసాగుతుండటంతో టమాట రైతులు పూర్తిగా చిత్తయ్యారు. నాలుగైదు లాట్ల గరిష్ట ధర రూ.10 ప్రకారం అమ్ముడుబోగా మిగతాదంతా రూ.5 నుంచి రూ.7 కి మించి ధర పలకలేదు. దీంతో చాలా మంది రైతులు.. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాదని గ్రహించి పంటను పొలాల్లోనే వదిలేశారు.

‘కూటమి’ మోసం..

జిల్లాలోని 31 మండలాల్లో ఖరీఫ్‌లో 42 వేల ఎకరాలు, రబీలో 3 వేల ఎకరాల్లో టమాట సాగు చేసినట్లు ఉద్యానశాఖ నివేదికలు చెబుతున్నాయి. టమాట రైతులు ఇబ్బంది పడకుండా కిలో రూ.8 చొప్పున టన్ను రూ.8 వేలతో కొనుగోలు చేస్తామని కూటమి ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అయితే ఆచరణకు వచ్చేసరికి మార్కెటింగ్‌శాఖ ద్వారా ఇటీవల కేవలం 60 టన్నులు అంటే రూ.4.80 లక్షల విలువ చేసే టమాట మాత్రమే కొనుగోలు చేసి చేతులెత్తేసింది. అనంతపురం మండీకి ప్రస్తుతం కొంత తగ్గినా డిసెంబర్‌ నుంచి పరిగణనలోకి తీసుకుంటే రోజుకు సగటున 500 టన్నుల వరకు సరుకు వస్తోంది. కనీసం రోజుకు 100 టన్నులైనా కొనుగోలు చేస్తే కొంత వరకు రైతులకు వెసులుబాటు ఉంటుంది. కానీ సీజన్‌ అంతా కొన్నది కేవలం 60 టన్నులు మాత్రమే అంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

నాలుగు నెలలుగా

గిట్టుబాటు ధర లేక భారీగా నష్టాలు

కిలో రూ.8 చొప్పున కొంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం

కేవలం 60 టన్నులతో

చేతులెత్తేసిన మార్కెటింగ్‌ శాఖ

రాష్ట్రంలోనే అత్యధికంగా

45 వేల ఎకరాల్లో టమాట పంట

ఎకరాకు రూ.50 వేలకు పైగా పెట్టుబడి పెట్టి రెండున్నర ఎకరాల్లో టమాట సాగు చేశా. పంట దిగుబడి బాగా వచ్చింది. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక భారీగా నష్టపోయాను. ఇటీవల మండీలో 15 కిలోల బాక్సు రూ.70కు మించి పలకలేదు. అంటే కిలో రూ.5 చొప్పున కూడా కొనుగోలు చేయడం లేదు. మొదటి నాలుగైదు కోతల్లో నాణ్యమైన కాయ ఉన్నా కొనలేదు. పెట్టుబడి మాట దేవుడెరుగు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతికి అందలేదు. ఇలా అయితే రైతులు ఎలా బతకాలి.

– సుధాకర్‌, టమాట రైతు,

దయ్యాలకుంటపల్లి, బీకేఎస్‌ మండలం

పెట్టుబడి కూడా అందలేదు 1
1/2

పెట్టుబడి కూడా అందలేదు

పెట్టుబడి కూడా అందలేదు 2
2/2

పెట్టుబడి కూడా అందలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement