పుట్టపర్తి అర్బన్: ఏక పంట విధానంతో నష్టాలు వస్తాయని, పంట మార్పిడి ఎంతో అవసరమని నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎం జాన్సన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పంట మార్పిడిపై రైతులకు అవగాహన పెంచాలన్నారు. వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రాలను తరచూ సందర్శించాలన్నారు. నూతన రకాల సాగు పద్దతులు, నూతన వంగడాల సాగు సమస్యలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మల్బరీ సబ్సిడీలపై సెరికల్చర్ అధికారి పద్మమ్మ వివరించారు. చేపల పెంపకంపై ముందుకు వచ్చే రైతులకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఫిషరీస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.