అన్యాయాలకు తావులేకుండా బదిలీల చట్టాన్ని రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

అన్యాయాలకు తావులేకుండా బదిలీల చట్టాన్ని రూపొందించాలి

Mar 7 2025 12:44 AM | Updated on Mar 7 2025 12:44 AM

ఎన్‌పీకుంట: ఏ ఒక్క ఉపాధ్యాయుడికీ అన్యాయం జరగకుండా బదిలీల చట్టానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వాన్ని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయుల బదిలీ ముసాయిదా చట్టంపై స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధనకు ఆటంకం లేకుండా వేసవిలో మాత్రమే బదిలీలు నిర్వహించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం మంచి పరిణామమన్నారు. మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలు స్వీకరించి వాటికి అనుగుణంగా అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఖాళీలను బ్లాక్‌ చేయకుండా బదిలీల సమయంలో అన్ని వెకెన్సీలను చూపాలన్నారు. సీనియర్‌, జూనియర్‌ అనే బేధం లేకుండా రీఅపోర్సన్‌ పాయింట్లు ఇవ్వాలన్నారు. రీ అపోర్సన్‌ అయ్యే స్కూల్‌ అసిస్టెంట్లకు అదనపు ప్రాధాన్యత ఉండేలా చూడాలన్నారు. ఏదైన పనిస్మెంట్‌కు గురైన వారికి పాయింట్స్‌ తగ్గింపు విషయాన్ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మురళి, సందీప్‌, గోవర్ధన్‌, షఫీ, రమణయ్య, రామ్మోహన్‌ తదితరులు ఉన్నారు.

బావిలో పడి యువకుడి మృతి

గుడిబండ: ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుడిబండలోని రాజు కాలనీకి చెందిన పార్వతమ్మ, క్రిష్టప్ప దంపతుల కుమారుడు భోజరాజు (23) గురువారం ఉదయం బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. సాయంత్రం వ్వవసాయ బావి వద్దకు వెళ్లిన క్రిష్టప్పకు అక్కడ బావి వద్ద భోజరాజు చెప్పులు కనిపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మోటార్‌ ద్వారా నీటిని తోడేసి భోజరాజు మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తండ్రి క్రిష్టప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాదరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement