పేరూరు డ్యాంకు నీళ్లివ్వాలి | - | Sakshi
Sakshi News home page

పేరూరు డ్యాంకు నీళ్లివ్వాలి

Mar 7 2025 12:44 AM | Updated on Mar 7 2025 12:42 AM

రాప్తాడు రూరల్‌: శ్రీశైలంలో కృష్జజలాలు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పేరూరు డ్యాంకు నీళ్లిచ్చేలా స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. త్వరలో హంద్రీ–నీవా కాలువకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు చెబుతున్న నేపథ్యంలో గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం డ్యాంలో 70 టీఎంసీల నీటి నిలువ ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు రోజూ అర టీఎంసీ చొప్పున నీటిని వినియోగిస్తున్నాయని, ఈ లెక్కన 140 రోజుల వరకు నీరు అందే అవకాశం ఉంటుందన్నారు. ఈలోపు పేరూరు డ్యాంకు నీళ్లు నింపేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ను పరిటాల సునీత కలిసినా పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలని అడగక పోవడం బాధాకరమన్నారు.

అప్పట్లో వరుసగా మూడేళ్లు నింపాం..

వైఎస్‌ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరుసగా మూడేళ్లు పేరూరు డ్యాంను నీటితో నింపినట్లు ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు. డ్యాంలో నీళ్లు లేకపోతే రాబోయే ఎండాకాలంలో నియోజకవర్గంలో వందలాది గ్రామాలు కనీసం తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయన్నారు. భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంను నీటితో నింపడం ద్వారా రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, ఆత్మకూరు మండలాల్లో భూగర్భజలాలు పెరిగి, 10 వేల ఎకరాల్లో పంటల సాగు అందుబాటులోకి వస్తుందన్నారు. రొద్దం మండలం తురలాపట్నం వంకలో నీళ్లు వదిలితే నేరుగా డ్యాంకు చేరుకుంటాయన్నారు. దీనికి కరెంటు ఖర్చు తప్ప ఇతర ఖర్చులేమీ ఉండవన్నారు. ఇంత చిన్న అంశాన్ని పరిటాల సునీత ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

డిమాండ్‌ రాగానే గేట్లు తొలిగించారు..

పేరూరు డ్యాంకు నీళ్లు ఇవ్వాలనే డిమాండ్‌ రైతుల నుంచి మొదలవగానే మరమ్మతుల పేరుతో ఉన్న గేట్లను తొలిగించడం దారుణమన్నారు. రైతులపై కక్ష తీర్చుకునేలా డ్యాంలో ఉన్న కొద్దిపాటి నీటిని కూడా పరిటాల సునీత వైఖరి కారణంగా దిగువకు వృధాగా పారాయన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 40 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యంతో హంద్రీ–నీవా కాలువను తెచ్చారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచారని గుర్తు చేశారు. పీఏబీఆర్‌ నుంచి రూ. 90 కోట్లతో మంచినీటి పైపులైను ఏర్పాటు చేశారన్నారు. జీడిపల్లి అప్పర్‌ పెన్నార్‌ లిఫ్ట్‌ ఇరిగినేషన్‌ స్కీమ్‌కు రూ.170 కోట్ల నిధులిచ్చారన్నారు. అయితే టీడీపీ హయాంలో చేసిందేమీలేదని, రూపాయి ఖర్చు లేకుండా నీళ్లిచ్చే అంశాన్ని సైతం ఎమ్మెల్యే సునీత నిర్లక్ష్యం చేస్తుండడం గమనిస్తే నియోజకవర్గ రైతులు, ప్రజల సంక్షేమం పట్టలేదనేది అర్థమవుతోందన్నారు.

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement