
మృతుడు వినయ్‌కుమార్
పుట్టపర్తి అర్బన్: తల్లిదండ్రుల మందలింపుతో మనస్తాపం చెందిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన గంటల మారెమ్మ ఆలయ పూజారి నాగరాజు, కల్పన దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమారుడు వినయ్‌కుమార్ (12) పెడపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఆలయంలో పూజాదికాలు నిర్వహణకు వెళ్లేందుకు సిద్ధమైన నాగరాజు... నిద్రిస్తున్న వినయ్‌కుమార్‌ను లేపి ద్విచక్ర వాహనంపై తల్లిని, అవ్వను ఆలయం వద్ద విడిచి రావాలని పురమాయించాడు. నిద్ర లేవకుండా ఆలస్యం చేయడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద కుమారుడు గోపీచంద్ నిద్రలేచి అమ్మను, అవ్వను ద్విచక్రవాహనంపై పిలుచుకెళ్లి ఆలయం వద్దకు చేరుకున్నాడు. ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన వినయ్‌కుమార్... నెలరోజుల క్రితం గృహ ప్రవేశం చేసిన ఇంట్లోకి వెళ్లి లోపల గదిలో కొక్కేనికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూజాదికాలు ముగిసిన తర్వాత అందరూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఎంత సేపు పిలిచినా తలుపు తీయకపోవడంతో వెనుక ఉన్న కిటికీ అద్దాలు పగులగొట్టి పరిశీలించారు. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న వినయ్‌కుమార్‌ను చూసి, వెంటనే తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. శరీరం కొంత వేడిగా ఉండడం గమనించిన స్థానికులు వెంటనే కారు ఏర్పాటు చేయడంతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఘటనపై ఎస్‌ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.