
రోదిస్తున్న భార్యాపిల్లలు, (ఇన్‌సెట్) పాపన్న అలియాస్ వెంకటేష్
ధర్మవరం రూరల్: పట్టణంలోని గీతానగర్‌కు చెందిన పాపన్న అలియాస్ వెంకటేష్ శుక్రవారం రాత్రి కిడ్నాప్‌నకు గురయ్యాడు. పోలీసులు, వెంకటేష్ భార్య గంగ తెలిపిన మేరకు.. గీతానగర్‌కు చెందిన పాపన్న పదేళ్ల క్రితం చైన్నెకి వెళ్లి స్థిరపడ్డాడు. అక్కడి ఫైనాన్స్‌దారులతో పరిచయాల ద్వారా తెలుగు వారికి రుణాలు ఇప్పించి వసూలు చేసేవాడు. రుణాలు సక్రమంగా వసూలు కాకపోవడంతో ఫైనాన్స్‌దారుల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో మూడు నెలల క్రితం తిరిగి ధర్మవరం వచ్చాడు. శుక్రవారం తన బైకును స్థానిక దిమ్మిల్ సెంటర్‌లో మెకానిక్ వద్ద రిపేరికి ఇచ్చి టీస్టాల్ వద్ద ఉన్నాడు. ఈ క్రమంలోనే చైన్నెకు చెందిన ఫైనాన్స్‌దారులు వల్లీమోహన్, మురగన్, గోపీనాథ్‌తో పాటు మరొకరు ఇన్నోవా వాహనంలో అక్కడికి వచ్చి పాపన్నను వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. స్థానికులు వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కదిరిలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులను పిలుచుకొని కదిరి టోల్ ప్లాజ్ వద్ద కాపు కాచారు. ఈ క్రమంలో కిడ్నాప్‌దారులలో ఒకరు బయటకు దూకి పారిపోయేందుకు యత్నించగా, వాహనం ఆగకుండా వేగంగా వెళ్లిపోయింది. పారిపోతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. కదిరి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. శని వారం పాపన్న భార్య ధర్మవరం వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేసింది. తమకు చిక్కిన వ్యక్తిని వెంటబెట్టుకొని నిందితులను పట్టుకునేందుకు సీఐ సుబ్రమణ్యం తన బృందంతో కలిసి చైన్నె వెళ్లారు.
