
నర్సింగ్ హోం ఎదుట ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబసభ్యులు
హిందూపురం: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకుల నిర్వాకం వల్ల పురిటి బిడ్డను కోల్పోయామంటూ దంపతులు ఎస్‌కే సల్మాన్, కౌసర్ వాపోయారు. సోమవారం మధ్యాహ్నం హిందూపురంలోని తేజా నర్సింగ్ హోం ఎదుట బాధిత కుటుంబసభ్యులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివరాలు... పురిటి నొప్పులతో బాధపడుతున్న కౌసర్‌ను ఈ నెల 21న కుటుంబసభ్యులు తేజా నర్సింగ్ హోంలో చేర్పించారు. ఉమ్ము నీరు తక్కువగా ఉందని, అయినా సాధారణ కాన్పు చేస్తామంటూ రూ.34వేలు ఫీజు డిమాండ్ చేశారు.
అయితే సాధారణ కాన్పు కాకుండా సిజేరియన్ చేశారు. అప్పటికే బిడ్డ మరణించింది. ఈ విషయాన్ని ఆస్పత్రి నిర్వాహకులు దాచిపెట్టి బేబీ పల్స్ డౌన్ అయ్యాయని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ సూచించారు. ఈ క్రమంలో మరో ఆస్పత్రికి చేరుకుంటే అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. కేవలం డబ్బు కోసం కాలయాపన చేసి తమకు కడుపుకోత మిగిల్చిన తేజా నర్సింగ్ హోం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ సల్మాన్ కుటుంబసభ్యులు ఆ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి తేజా నర్సింగ్ హోం డాక్టర్ అశ్వినిని వివరణ కోరగా... ‘కడుపునొప్పితో బాధపడుతున్న గర్భిణిని రెండు వారాల క్రితం ఆస్పత్రికి పిలుచుకువచ్చారు.
ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో రెండ్రోజులు అడ్మిట్ చేసుకుని చికిత్స చేశాం. నొప్పి తగ్గడంతో ఇంటికి వెళ్లిపోయారు. అప్పటికే 14 శాతం ఉన్న ఉమ్మునీరు.. రెండు వారాల తర్వాత 8 శాతానికి చేరుకుంది. అయినా వారు అలాగే ఉండి కడుపునొప్పి తీవ్రమైనప్పుడు మళ్లీ వచ్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు నవజాత శిశువును ఐసీయూలో ఉంచాల్సి వస్తుందని చెప్పి, అనంతపురానికి తీసుకెళ్లాలని సూచించాం. అయితే వాళ్లు ఒప్పుకోలేదు. ఇక్కడే కాన్పు చేయాలని కోరడంతో ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నాం. మూడ్రోజుల పాటు ఇన్‌ఫెక్షన్‌ను కంట్రోల్ చేయడానికి చికిత్స చేశాం. డబ్బు కట్టలేదని కాన్పు చేయకుండా ఆలస్యం చేశారనడం అవాస్తం. మెరుగైన చికిత్సనే అందజేశాం’ అని అన్నారు.