
శ్రీసత్యసాయి జిల్లా: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్‌లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ కుటుంబాన్ని ఈ నెల 13న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించిన సంగతి తెలిసిందే.. పార్టీ తరపున ఆయన రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.
రూ.25 లక్షల రూపాయల చెక్కును వీర జవాను మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ అందజేశారు. గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి వీర జవాన్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చెక్కును ఆమె అందించారు. కాగా, మూడు రోజల క్రితం (13వ తేదీన) మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకుని.. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు.
