
పుట్టపర్తి టౌన్: బీటెక్ (ఈసీఈ, ఈఈఈ) ఉత్తీర్ణులై ఇంకా ఉద్యోగాలు దక్కని యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా నూతన కోర్సులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూమ్, జాబ్స్ కోఆర్డినేటర్ ఆంజనేయులు తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ యువజన ట్రైనింగ్ సెంటర్ రామగిరి సిల్క్ కాలేజ్ ద్వారా వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ ఇంజినీరింగ్, ఈఎంబీఈడీఈఈడి ప్రొడక్ట్ డిజైన్ కోర్సులు ప్రారంభిస్తున్నామన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9640899337 నంబరులో సంప్రదించాలన్నారు.
పలు రైళ్లు రద్దు..
మరికొన్ని దారి మళ్లింపు
గుంతకల్లు: బెంగళూరు సమీపంలో రైల్వే పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సీహెచ్ రాకేష్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధర్మవరం–బెంగళూరు (06595/96) స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను ఏప్రిల్ ఒకటి, ఆరు, 29 తేదీల్లో రద్దు చేసినట్లు వెల్లడించారు. ఇక పూరి–యశ్వంత్‌పూర్ (22883) ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 31న నంద్యాల, యరగుంట్ల, రేణిగుంట, జోలర్‌పేట్ మీదుగా యశ్వంత్‌పూర్‌కు మళ్లించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎల్‌టీటీ ముంబై–కోయంబత్తూరు (11013) ఎక్స్‌ప్రెస్ రైలును గుంతకల్లు, రేణిగుంట, జోలర్‌పేట్, సేలం మీదుగా కోయంబత్తురుకు మళ్లించినట్లు వివరించారు. గుంతకల్లు డివిజన్‌లోని పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో భాగంగా గుంతకల్లు–రాయచూర్ స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను 23 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రద్దు చేసినట్లు తెలిపారు. నంద్యాల–కడప (07284/85), విజయపూర–రాయచూర్ స్పెషల్ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకూ పూర్తిగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
27న ‘104’ నూతన
వాహనాల ప్రారంభం
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఉమ్మడి జిల్లాకు కేటయించిన పది నూతన 104 వైద్యసేవల వాహనాలను ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ఈ మేరకు 104 అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మేనేజర్లు కృష్ణమూర్తి, శంకర్ బుధవారం వెల్లడించారు. అనంతపురం జిల్లాకు ఆరు వాహనాలు మంజూ రయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లాకు నాలుగు వాహనాలు మంజూరు కాగా, ముదిగుబ్బ, గోరంట్ల, మడకశిరకు ఒక్కో వాహనాన్ని కేటాయించారు. జిల్లా కేంద్రంలో ఓ వాహనాన్ని బ్యాకప్‌గా వినియోగించనున్నారు.
