ఊరంతా ఉగాది సంబరం

కలెక్టరేట్‌లో నిర్వహించిన పంచాంగశ్రవణంలో కలెక్టర్‌ దంపతులు - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: తెలుగు సంవత్సరాది ఉగాదిని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి శోభకృత నామ సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇళ్లు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి.. పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి ఆరగించి సంతోషంగా గడిపారు. అంతకుముందు షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఆరగించారు.

సంప్రదాయాలను గౌరవించాలి..

సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో బుధవారం ఉదయం ఉగాది మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ దంపతులతో పాటు జిల్లా అధికారులంతా సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి ఆకట్టుకున్నారు. ఉగాది రోజు నిర్వహించే పంచాంగ శ్రవణం సర్వకార్య ఫల ప్రదం కావాలని, శోభకృత నామ సంవత్సరంలో జిల్లా ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. వేదపండితులు నాగరాజశర్మ, సత్యనారాయణ, శ్రీనివాస శర్మ బృందం ఆధ్వర్యంలో పంచాంగ పఠనం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం పురోహితులను ఘనంగా సన్మానించారు. పట్టు వస్త్రాలు అందజేశారు. ఉగాది పచ్చడి, ప్రసాదాలు పంపిణీ, సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఆనవాయితీగా మధుగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు పద్మనాభచారి, మొలకల చెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయ పురోహితులు శ్రీనివాసయ్య, పట్నం చెన్నకేశవస్వామి ఆలయ పురోహితులు వేంకటాచలపతి శర్మ ఘనంగా సన్మానించారు. దేవదాయశాఖ ద్వారా వారికి రూ.10,116 పారితోషకం, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్మవరానికి చెందిన నృత్య కళాకారిణి రామలాలిత్య దేవీ స్తుతి మహిషాసుర మర్దిని కూచిపూడి నృత్యంతో అలరించింది. కార్యక్రమంలో ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్‌ దంపతులు, డీఆర్‌ఓ కొండయ్య, పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌, పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, కదిరి ఆర్డీఓ రాఘవేంద్ర, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, జిల్లా అగ్రి అడ్వయిజరీ బోర్డు చైర్మన్‌ అవుటాల రమణారెడ్డి, సీపీఓ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. సాయంత్రం శిల్పారామంలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

ప్రశాంతి నిలయంలో...

ప్రశాంతి నిలయం: పండితుల పంచాంగ పఠనం... భక్తకోటి సాయి నామస్మరణ నడుమ ప్రశాంతి నిలయంలో శోభకృత నామ ఉగాది పర్వదిన వేడుకలు బుధవారం కనులపండుగగా జరిగాయి. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే రీతితో సాయికుల్వంత్‌ సభా మందిరాన్ని పచ్చటి తోరణాలు, మామిడి కాయలు, పుష్పాలతో అలంకరించారు. అవధాని గోలి వెంకట సుబ్రహ్మణ్యం శర్మ పంచాంగ శ్రవణానికి భక్తులు పోటెత్తారు. సత్యసాయి ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు, సుబ్రహ్మణ్యంశర్మను నూతన వస్త్రాలతో సన్మానించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. సాయంత్రం వేడుకల్లో భాగంగా ప్రముఖ సీనీ ప్లేబ్యాక్‌ సింగర్‌ రమ్యా బెహరా నిర్వహించిన భక్తిరస సంగీత కచేరీతో భక్తులు మైమరచిపోయారు.

జిల్లా వ్యాప్తంగా ఆకట్టుకున్న కార్యక్రమాలు

ఆలయాల్లో పంచాగ శ్రవణాలు

సంస్కృతి చాటేలా కలెక్టరేట్‌లో ఉత్సవాలు

Read latest Sri Sathya Sai News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top