
అనంతపురం పాతూరు కూడలిలో జన రద్దీ
పట్టణ జనాభా క్రమేణా పెరుగుతోంది. పల్లెల నుంచి వలస వస్తున్న వారి సంఖ్య ఏటేటా అధికమవుతోంది. పిల్లల చదువులు, ఉద్యోగం, వ్యాపారం తదితర అవసరాల రీత్యా పట్టణ ప్రాంతాలకు చేరుతున్నారు. నగరపాలక సంస్థ, పురపాలక సంస్థల పరిధి, శివారు ప్రాంత భూముల విలువ అమాంతం పెరిగిపోతోంది.
● ఏటేటా పెరుగుతున్న జనాభా
● పట్టణాలకు పోటెత్తుతున్న పల్లె జనం
● పిల్లల చదువుల కోసమని కొందరు
● ఉద్యోగం.. వ్యాపారానికి మరికొందరు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: గ్రామీణులు అవసరాలు.. అవకాశాల కోసం పట్టణాల వైపు పయనమవుతున్నారు. పల్లెల నుంచి వలస వస్తున్న వారితో పట్టణ జనాభా పెరుగుతోంది. నాలుగెకరాల పొలం ఉన్న రైతు కూడా తమ పిల్లలను మంచి స్కూళ్లలో చదివిస్తున్నారు. ఇక ఉద్యోగస్తులకు పట్టణాల్లో ఉండక తప్పనిపరిస్థితి. ఇవన్నీ పక్కన పెడితే పట్టణాలకు 30 కిలోమీటర్ల దూరంలో ఉద్యోగమైనా సరే రోజువారీ ఉద్యోగానికి వెళ్లి తిరిగి పట్టణం చేరుకుంటున్నారు. రూ.20వేల నెల వేతన జీవులు కూడా వ్యయం భారమైనా పట్టణం వైపే మొగ్గుచూపుతుండటం విశేషం.
అవసరాలు ఎన్నో...
అనంతపురం లాంటి మున్సిపల్ కార్పొరేషన్, కదిరి, ధర్మవరం, హిందూపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, పుట్టపర్తి వంటి మున్సిపాలిటీల్లో ఏటా 2 నుంచి 3 శాతం పల్లెల నుంచి వస్తున్న జనాభా ఉన్నట్టు తేలింది. చిరువ్యాపారాలు, భవన నిర్మాణ రంగం కూలీలు, చిన్నచిన్న బడ్డీ కొట్లు వంటి వారు పట్టణం వైపే మొగ్గు చూపుతున్నారు. పట్టణాలకు 20 కిలోమీటర్ల దూరంలో పొలాలున్న వందలాదిమంది రైతులు సైతం పట్టణంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కాగా గడిచిన పదేళ్లలో ఎక్కువమంది పట్టణాలకు చేరుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2021 అంచనాల ప్రకారం దాదాపు 42 లక్షల జనాభా ఉంది. తాజా అంచనాల ప్రకారం 14.30 లక్షల మంది (34 శాతం)కి పైగా పట్టణాల్లో ఉన్నారు. ప్రతి పదేళ్లకు సగటున 4 శాతం మాత్రమే పట్టణ జనాభా పెరుగుతుండగా గడిచిన పదేళ్లలో మాత్రం ఈ శాతం 6కు చేరిందని నిపుణులు చెబుతున్నారు.
