
పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులు
ధర్మవరం అర్బన్/ఎన్‌పీకుంట: చేతిరాత బాగుంటే మంచి మార్కులు సొంతమవుతాయంటున్నారు నిపుణులు. త్వరలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే చేతిరాత కూడా ఓ ఆయుధమని అంటున్నారు. మరో 20 రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు రాతతోపాటు పరీక్ష రాసే విధానంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
ఈ మెలకువలు పాటించండి..
● జవాబు పత్రం పై భాగంలో అంగుళం స్థలం, ఎడమవైపు అదేస్థాయిలో మార్జిన్ విడిచిపెట్టాలి. కుడి వైపున అర అంగుళం ఖాళీ విడిచి రాయాలి.
● జవాబు రాసిన తీరు పేపర్ దిద్దే సమయంలో ఇబ్బందికరంగా ఉండరాదు.
● జవాబు పత్రాలు ఆకట్టుకోవాలంటే పేజీకి 18 నుంచి 19 లైన్లకు మించకుండా రాయాలి.
● వరుస ముగింపులోని పదం పూర్తిగా ఉండేలా చూసుకోవాలి.
● అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే మార్కులు తగ్గే ప్రమాదముంది.
● సామాన్య శాస్త్రంలో బొమ్మలు గీసి భాగాలను గుర్తించడంలో క్రమపద్దతి పాటించాలి.
● పరీక్షలకు కొత్త పెన్నులు తీసుకెళ్లకపోవడమే మంచిది. తీరా పరీక్ష సమయంలో అది సక్రమంగా రాయకపోవచ్చు. జెల్ పెన్నులతో ఇబ్బందులు తప్పవు. రెండు బాల్ పెన్నులు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒకే కంపెనీవైతే మరీ మంచిది.
● బ్రాకెట్లలో రాసే ఏ, బీ, సీ, డీలు పెద్ద అక్షరాల్లోనే ఉండాలి. వాటిని కొట్టివేయడం, దిద్దడం చేయకూడదు.
● గణితానికి సంబంధించి అంకెలు సక్రమంగా రాయాలి.
● వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి.
● జవాబు మొదలు పెట్టిన స్థలం నుంచి చివరి వరకూ సమాంతరంగా రాయాలి. పైకో.. కిందికో వెళ్లకూడదు. ఒక వరుసను అలా రాస్తే మిగిలిన వరుసలు కూడా అలాగే వస్తాయి.
● పదానికి పదానికి మధ్యలో తగిన నిడివి పాటించాలి.
● ఆన్సర్ షీట్‌ను ఒత్తిపెట్టి రాయకూడదు.
‘శోభకృత్‌లో అన్నీ శుభాలే’
సాధనతోనే అందమైన
చేతిరాత సాధ్యం
పరీక్షల్లో అధిక మార్కులు
సాధించాలంటే చేతిరాత కూడా ప్రధానం
ప్రాథమిక సూత్రాలు తప్పనిసరి
ప్రతి విద్యార్థి చేతిరాతకు సంబంధించి ప్రాథమిక సూత్రాలు పాటించాలి. మూల్యాంకనం చేసేటప్పుడు విద్యార్థుల చేతిరాతను కూడా గమనిస్తారు. కొట్టివేతలు లేకుండా ఆకర్షణీయంగా రాస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది.
– శెట్టిపి జయచంద్రారెడ్డి,
ఉపాధ్యాయుడు, ధర్మవరం
ఆందోళనకు గురికాకూడదు
పరీక్షల సమయంలో ఆందోళనకు గురికాకూడదు. అవిశ్రాంతంగా చదువుకోవడం కూడా చేతిరాతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆత్మస్తైర్యం కలిగి ఉండాలి.
– గోపాల్‌నాయక్, ఎంఈఓ, ఎన్‌పీకుంట

