నెల్లూరు (టౌన్): నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని ఏఐడీఎస్‌ఓ జిల్లా ఇన్‌చార్జి సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వీఆర్ హైస్కూల్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేపర్ లీక్ చేసిన వారిని శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపైనే అనుమానం వ్యక్తం చేయడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో నగర ఇన్‌చార్జి ప్రియ, సభ్యులు థామ్సన్, మస్తాన్, సాధిక్, ధనూష్ పాల్గొన్నారు.
నేర ప్రవృత్తిని వీడాలి
నెల్లూరు(క్రైమ్): నేరచరిత్ర కలిగిన వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకుని సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని పోలీసు అధికారులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, కేడీలు, డీసీలు, సస్పెక్ట్‌లకు పోలీసు అధికారులు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంటుందని, ప్రజాజీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై పీడీయాక్ట్‌లు తప్పవని హెచ్చరించారు. మీ ప్రాంతాల్లో అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే డయల్ 112, పోలీసు కంట్రోల్‌రూమ్ వాట్సాప్ నంబర్ 93929 03413 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసు అధికారులు కోరారు.
భార్య కళ్లెదుటే భర్త మృతి
మనుబోలు: భార్య కళ్లెదుటే భర్త మరణించిన విషాదకర ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు వెంగళరావు నగర్‌కు చెందిన వేమాల సాయి(30) భార్యతో కలిసి మోటార్‌సైకిల్‌పై నాయుడుపేటకు వెళ్లి తిరిగి నెల్లూరుకు వస్తున్నారు. మండలంలోని కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు సమీపంలోని వంతెన రెయిలింగ్‌ను బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న మనుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గాయపడిన వ్యక్తి మృతి
నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని సౌత్‌మోపూరు నుంచి ఓ వ్యక్తి బైక్‌పై నెల్లూరు వస్తుండగా ఎదురుగా మరో బైక్ ఢీకొని గాయపడిన సురేష్‌బాబు(52) చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన సురేష్‌బాబు సౌత్‌మోపూరులోని కెనరా బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీన సౌత్‌మోపూరు నుంచి నెల్లూరుకు బైక్‌పై వస్తున్నారు. ఎదురుగా మరో బైక్ అతన్ని ఢీకొంది. దీంతో సురేష్‌బాబు తీవ్రగాయాలపాలయ్యాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న సురేష్ ఆదివారం మృతిచెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


