● పదేళ్లుగా రోడ్డు పక్కనే..
● పట్టించుకోని స్థానికులు..
నిగ్గు తేల్చని పోలీసులు
విడవలూరు: దాదాపు పదేళ్ల క్రితం ఓ రాత్రి మండల కేంద్రం నుంచి మలిదేవి వెళ్లే దారిలో ఎస్సీకాలనీ పరిసరాల్లో ఒక వాహనం వచ్చి ఆగింది. అందులోంచి దిగిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ వాహనాన్ని అక్కడే పార్కింగ్ చేసి, క్షణాల్లో మాయమయ్యారు. కట్ చేస్తే.. దశాబ్దం గడిచినా నేటికీ ఆ వాహనం అక్కడి నుంచి కదల్లేదు. దాని ఓనర్ ఎవరో కూడా ఎవరికీ తెలియదు. అప్పట్లో సరికొత్తగా ఉన్న ఆ వాహనం కాలక్రమేణా ఎండ, వానల ప్రభావం పడి, ఎవరూ పట్టించుకోకపోవడంతో చుట్టూ చెట్లు, పొదలు అల్లుకుపోవడంతో తుప్పుపట్టి శిథిలమైపోయి ఒక అనాథలా దర్శనమిస్తోంది. వాహనాన్ని వదిలి వెళ్లి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఎవరూ దీనికోసం రాకపోవడం వెనుక పెద్ద మిస్టరీయే ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదైనా క్రైమ్ లేదా దొంగతనానికి గురైనా వాహనం ఇక్కడ తెచ్చి పడేశారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. పోలీసులు స్పందించి, ఆ వాహన నంబరు ఆధారంగా దాని హిస్టరీని తవ్వితీస్తే, ఏదైనా కీలకమైన నేర సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


