● విశ్వబ్రాహ్మణులకు మధుసూదనాచారి పిలుపు
నెల్లూరు(బృందావనం): విశ్వబ్రాహ్మణులు సంఘటితంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేసి తమ ఉనికిని చాటుకోవాలని తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ సభాపతి సిరికొండ మధుసూదనాచారి పిలుపునిచ్చారు. జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు అగర సుబ్రహ్మణ్యం ఆచారి, గౌరవాధ్యక్షుడు అల్లంపాటి వెంకటరమణాచారిల ఆధ్వర్యంలో రంగనాయకులపేటలోని సోమిశెట్టి వారి కల్యాణ మండపంలో ఆదివారం ఏపీ విశ్వబ్రాహ్మణ డెవలప్‌మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మరి పార్వతమ్మ, హైదరాబాద్ ఆర్థిక నేర విభాగం సహాయ పోలీస్ కమిషనర్ కేఎం కిరణ్‌కుమార్ ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మధుసూదనాచారి హాజ రై, మాట్లాడుతూ సమాజం క్రియేటర్స్, ఇమిటేటర్స్, స్పెక్టేటర్స్, ఫ్రస్టేటర్స్‌తో ఉంటుందన్నారు. క్రియేటర్స్ గా ఉన్న విశ్వబ్రాహ్మణ సంఘీయులు నేడు తమ జాతి శక్తిని విస్మరించి ఎవరికి వారు సంఘాలుగా విడిపోయి బలహీనులుగా మారి ఫ్రస్టేటర్స్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ తీరులో మార్పు రావాలంటే ఐక్యతగా ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగాలన్నారు. తాను చెప్పినట్లు వ్యవహరిస్తే జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేని, స్థానిక సంస్థల్లో ఒక చైర్మన్ పదవిని పొందవచ్చన్నారు. అనంతరం మధుసూదనాచారి, పార్వతమ్మ, కిరణ్‌కుమార్‌లను సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ నాగార్జునాచారి, ఎల్.భోగేశ్వరరావు, తాటికొండ రంగబాబు, చెన్నుపల్లి శ్రీనివాసరావు, చికలపాటి మధుసూదనాచారి, గుమ్మడిపూడి కల్యాణ్‌ఆచారి, ఆర్కాట్ కుమార్, సీహెచ్ పిచ్చయ్య ఆచారి, గజ్జల మోహనాచారి, బి.పవన్‌కుమార్, సానాల రవీంద్ర ఆచారి పాల్గొన్నారు.


