నెల్లూరు(క్రైమ్): యోగాతో ఒత్తిడి దూరమవుతుందని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందుతాయన్నారు. పోలీసు విధుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుందని, యోగా, ధ్యానం అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారు సైతం యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్ పోలీస్–ఫిట్ సొసైటీ లక్ష్యంతో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఏఆర్ ఏఎస్పీ అప్పారావు, నగర ఏఎస్పీ దీక్ష, యోగా గురువు మురళి, డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గిరిధర్, చంద్రమోహన్, రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


