అనుమసముద్రంపేట: ఏఎస్‌పేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంపై దాడులను ఏసీబీ అధికారులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.20 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ శాంతి స్వరూప్ పట్టుబడ్డారు. పందిపాడుకు చెందిన బాధిత రైతులు కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి వివరాల మేరకు.. పొలాలకు సంబంధించిన మ్యుటేషన్ కోసం ఆన్‌లైన్లో గత నెల 17న దరఖాస్తు చేసుకున్నామని, వీటిని ఆర్‌ఐ, వీఆర్వోవెరిఫికేషన్ చేసి తహసీల్దార్‌కు అప్పగించారని చెప్పారు. పని పూర్తి చేసేందుకు రూ.40 వేలు డిమాండ్ చేయగా, అంత ఇచ్చుకోలేమని చెప్పగా, చివరికి రూ.20 వేలను ఇవ్వాలని ఆయన సూచించారు. అయితే ఈ మొత్తాన్నీ ఇవ్వడం ఇష్టం లేని వీరు ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల సూచనల మేరకు ఈ నగదును కార్యాలయంలో తహసీల్దార్‌కు ఇచ్చే సమయంలో ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు, సీఐ విజయ్‌కుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేయనున్నామని చెప్పారు.


