ఇలాగైతే బడికి పంపలేం | - | Sakshi
Sakshi News home page

ఇలాగైతే బడికి పంపలేం

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

గిరిజన కాలనీ వాసుల ఆవేదన

కోట: స్థానిక శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్యాంసుందరపురంలోని మోడల్‌ ప్రైమరీ స్కూల్‌కు తరలించడాన్ని తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు గిరిజన కాలనీవాసులు కలెక్టర్‌ను కలిసి గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎంఈఓలు శిరీష, మస్తానయ్యలు గిరిజన కాలనీలో శనివారం విచారణ జరిపారు. తల్లిదండ్రులు తెలిపిన వివరాలు.. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకునే వెసులుబాటు ఉండేదని, దీంతో పిల్లలను బడికి పంపించామన్నారు. శ్యాంసుందరపురం ప్రాథమిక పాఠశాలలో ఇక్కడి 3, 4, 5 తరగతులను విలీనం చేయడంతో 16 మంది విద్యార్థులు రెండు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి పాఠశాల ముగిసిన తరువాత నడిచి రావాల్సి వస్తుందన్నారు. అంతదూరం వెళ్లి రావడంతో చిన్న పిల్లలు అలసిపోతున్నట్లు తెలిపారు. కాలనీలో ఉన్న పాఠశాలను 1, 2 తరగతులకే పరిమితం చేశారని, ఇలాగైతే గిరిజనులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై ఎంఈఓ శిరీష మాట్లాడుతూ డీఈఓకు నివేదికను పంపుతామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement