ఆత్మకూరు: కూటమి పాలనలో వ్యవసాయం నిర్వీర్యమైందని, ప్రస్తుతం పొగాకు రైతుల ఇక్కట్లు దారుణంగా మారాయని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిట్టుబాటు ధరల్లేక బోర్డు ముందే పొగాకు రైతులు ధర్నాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వీరి పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకొని కిలోకు రూ.350 చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. తేలిక నేలల్లో పండే నాణ్యమైన పొగాకును డీసీపల్లి వేలం కేంద్రం ద్వారా విక్రయానికి రైతులు పెడతారని, అలాంటి దాని ధరలను సైతం బయ్యర్లు సిండికేట్‌గా మారి తగ్గించేయడం దారుణమన్నారు. సర్కార్ ఇప్పటికై నా ఈ విషయంలో జోక్యం చేసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
డీసీపల్లిలో 241
పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 241 బేళ్లను మంగళవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 320 బేళ్లు రాగా, వీటిలో 241ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 33,753.8 కిలోల పొగాకును విక్రయించగా, రూ.73,55,834 వ్యాపారం జరిగిందని వెల్లడించారు. గరిష్టంగా కిలో రూ.250.. కనిష్టంగా రూ.190.. సగటు ధర రూ.217.93గా నమోదైందని పేర్కొన్నారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు.
కేజీబీవీల్లో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఏడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులకు సంబంధించి 2026 – 27 విద్యా సంవత్సరంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావలి, నందిపాడులోని కేజీబీవీల్లో పీఈటీ – 2.. నందిపాడులో మ్యాఽథ్స్.. సీతారామపురంలో తెలుగు.. మర్రిపాడులో ఫిజికల్ సైన్స్.. కలిగిరిలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. kgbvrecruitment.apcfss.in ద్వారా దరఖాస్తులను పంపాలని కోరారు. దరఖాస్తు రుసుముగా రూ.300ను చెల్లించాలన్నారు. ఈ ఏడాది జూలై ఒకటి నాటికి ఓపెన్ కేటగిరీ, ఎక్స్ – సర్వీస్ ఉమెన్ అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 ఏళ్లు.. దివ్యాంగులకు 52 ఏళ్లు ఉండాలని తెలిపారు. జిల్లాలో టెట్, బీఈడీ, పీజీ అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులని, ఆసక్తి గల వారు వచ్చే నెల ఐదులోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 70750 39990, 79933 29115 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఫలితాల్లో తక్కువ శాతం తెచ్చిన తంటా
● ఐదుగురు చొప్పున ప్రిన్సిపల్స్,
పీజీటీలకు నోటీసులు
నెల్లూరు (టౌన్): పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో కందుకూరు నియోజకవర్గంలో తక్కువ పాస్ పర్సంటేజీ వచ్చిన కేజీబీవీల ప్రిన్సిపల్స్, పీజీటీలకు నోటీసులను సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం జారీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర యావరేజ్ 85 శాతం కాగా, 79.5 శాతం ఫలితాలు రావడంతో గుడ్లూరులోని మొగళ్లూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌కు నోటీసులు పంపారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు 81 శాతం కాగా, కందుకూరు నియోజకవర్గంలోని వీవీపాళెంలో 75.. ఉలవపాడులో 77.. కందుకూరులో 45.8.. లింగసముద్రంలో 66.6 శాతం ఉత్తీర్ణత రావడంతో అక్కడి కేజీబీవీల ప్రిన్సిపల్స్‌కు నోటీసులను జారీ చేశారు. వీరితో పాటు ఆయా సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు రావడంతో ఐదుగురు పీజీటీలకూ నోటీసులు జారీ అయ్యాయి. వీరందరూ వారంలో వివరణ పంపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిని సమగ్రశిక్ష రాష్ట్ర అధికారులకు పంపి, వారి నిర్ణయం మేరకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు.
ఏపీఈడీ సెట్ ఫలితాల విడుదల
● సీతారామపురం వాసికి ద్వితీయ ర్యాంక్
నెల్లూరు (టౌన్): రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈడీసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. ఈ నెల ఎనిమిదిన నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లాలో 1200 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంగ్లిష్ మెథడాలజీలో సీతారామపురానికి చెందిన మామిడి శివ 126 మార్కులతో రాష్ట్రంలో ద్వితీయ ర్యాంక్‌ను సాధించారు.


