లేబుళ్లు లేకుండానే మద్యం విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

లేబుళ్లు లేకుండానే మద్యం విక్రయాలు

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నేతలు మద్యం మాఫియాలుగా అవతరించి మహత్తుగా ‘అదనపు’ దోపిడీకి పాల్పడుతున్నారు. ఊరూరా విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి అఫిషియల్‌గా క్యూఆర్‌ కోడ్‌ పెట్టి దోచుకుంటున్నారు. అయినా ఎకై ్సజ్‌ శాఖ అవినీతి మత్తులో జోగుతోంది. జిల్లాలో 190 మద్యం దుకాణాలు, 54 బార్‌లు ఉండగా సుమారు 2 వేలకు పైచిలుకు బెల్టు షాపుల్లో ఊరూరా మద్యం ఏరులై పారుతోంది. జిల్లాలోని సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు నియోజకవర్గాల్లో అదనపు వడ్డనతో మద్యం సిండికేట్‌ జేబులు నింపుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. లైసెన్స్‌ దుకాణాల నుంచి బెల్టు షాపుల వరకు అర్ధరాత్రి వేళ వరకు తెరిచి ఉంచి యువతను మద్యం మత్తులో ముంచెత్తుతున్నాయి. స్కూళ్లు, కాలనీలు, ప్రధాన రహదారుల వెంబడి మద్యం విక్రయాలు జరుగుతున్నా.. ఎకై ్సజ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో రోజుకు ఆరు లక్షల మంది మద్యపానం చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రశాంతమైన పల్లెల్లో బెల్టు దుకాణాలు చిచ్చు రేపుతుండగా, నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలను బలి తీసుకుంటున్నాయి.

బెల్ట్‌ షాపుల్లోనూ బ్రాండెడ్‌ మద్యం

జిల్లాలో మద్యం వ్యాపారం అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లడంతో పట్టణాలు, గ్రామాల్లో బెల్టు షాపులను ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాల్లో బెల్టు షాపులు కీలకంగా మారాయి. వీటికి రూ.లక్షల్లో వేలం పాటలు నిర్వహించి మరీ ఏర్పాటు చేయడం విశేషం. లైసెన్స్‌ దుకాణాల్లో 40 శాతం విక్రయాలు సాగితే బెల్టు దుకాణాల్లో 60 శాతం విక్రయాలు సాగుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నేరుగా మద్యం దుకాణాల నుంచే వాటికి మద్యం సరఫరా అవుతోంది. బెల్టు షాపుల్లో కేవలం చీప్‌ లిక్కర్‌ మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం అన్నీ రకాల బ్రాండ్లు, బీర్లూ అందుబాటులో ఉన్నాయి. క్వార్టర్‌, బీరుపై అదనంగా రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. మద్యం షాపుల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంటున్నారు. అయితే బెల్టు షాపుల్లో మాత్రం 24/7 మద్యం విక్రయాలు సాగుతోన్నాయి. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి సర్కార్‌ మద్యంను మాత్రం మందు బాబుల చెంతకు చేర్చి వారిని మద్యానికి మరింత బానిసలుగా మార్చి ఇళ్లు, ఒళ్లును గుళ్ల చేస్తోంది. దీంతో ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సంపద సృష్టిస్టామని ఎన్నికల ముందు పదేపదే చెప్పిన చంద్రబాబు ఈ తరహాలో జనం జేబుల్లో నుంచి సొమ్ము గుంజు కుంటూ ఖజానాను నింపుకుంటున్నారన్న విమర్శలున్నాయి.

మామూళ్లతో మూలాలకు వెళ్లట్లేదా?

లైసెన్స్‌ దుకాణాల నుంచి బెల్టు షాపు వ్యాపారులతో ఇప్పటికే అధికారులు మూమూళ్లు ఫిక్స్‌ చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అనధికార మద్యం విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలపై నామమాత్రపు చర్యలకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. బెల్టు విక్రయాలపై దాడులు చేసి నిర్వాహకుల అరెస్ట్‌లతో సరిపెట్టుకుంటున్నారు. అసలు బెల్టు షాపునకు మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు సరఫరా చేశారనే మూలాల్లోకి వెళ్లకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అనేక దుకాణాల నుంచే బెల్టుకు మద్యం సరఫరా అవుతున్నట్లు సమాచారం. అయితే ఇంత వరకు ఒక్క దుకాణంపైనా కేసు నమోదు కాకపోవడం గమనార్హం. అయితే అధికారులు మాత్రం పట్టుబడిన మద్యం సీసాల లేబుళ్లు లేని కారణంగా అవి ఏ దుకాణం నుంచి సరఫరా అయిందో తెలుసుకోలేకపోతున్నామని చెబుతున్నారు.

సింహపురి అడ్డాలో సిండికేట్‌ దందా

జిల్లాలో విచ్చలవిడిగా బెల్టు షాపులు

అఫిషియల్‌గా క్యూఆర్‌ కోడ్‌ పెట్టి వ్యాపారం

పట్టించుకునే నాథుడే లేడు

అవినీతి మత్తులో ఎకై ్సజ్‌

ఎమ్మార్పీ ఉల్లంఘిస్తే చర్యలు

ఎమ్మార్పీ మేరకే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఉల్లంఘనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవు.

– ఎ. శ్రీనివాసులునాయుడు, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి

మద్యం బాటిళ్లపై సమగ్ర సమాచారంతో అతికించే లేబుళ్లు లేకుండానే విక్రయాలు చేస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ డంప్‌లు దొరికిన విషయం తెలిసిందే. ఆ డంప్‌ల ద్వారా రాష్ట్రంలోని నలుమూలలకు నకిలీ మద్యం సరఫరా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతి బాటిల్‌పై లేబుల్‌ను చెక్‌ చేసుకోవాలని యాప్‌ ప్రవేశ పెట్టింది. బెల్టు దుకాణాల్లో బాటిల్‌పై లేబుళ్లు లేకపోవడంతో అది నకిలీదా? ఒరిజినల్‌? అనేది పరీక్షించుకునే అవకాశం లేకుండా పోయింది.

దాబాల్లోనూ...

జిల్లాలో చిన్నా, పెద్ద కలిపి 300కు పైచిలుకు దాబాలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయించాలంటేనే భయపడే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. కూటమి నేతల అండదండలతో అధిక శాతం దాబాల నిర్వాహకులు యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. మద్యం మీరు తెచ్చుకున్నా సరే.. లేదంటే సిబ్బందే సమకూరుస్తారని మందు బాబులకు నిర్వాహకులు ఆఫర్‌ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్య సేవనం చేయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement