ఆక్రమణల పర్వం
అధికారులు
నెల్లూరు(బారకాసు): నగరంలో మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలో రూ.కోట్ల విలువైన భూములు ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. నగర పాలక సంస్థ అధికారుల అండదండలతో ఇరిగేషన్, దేవదాయ శాఖలతో పాటు కార్పొరేషన్ స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారు. ఏకంగా రోడ్డు స్థలాలను ఆక్రమించి దుకాణాల నిర్మాణం చేపడుతున్నా అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
● నగరంలోని మూడో డివిజన్ ప్రశాంతినగర్ సమీ పంలోని చేపల మార్కెట్ పక్కన ఓ బార్‌అండ్ రెస్టారెంట్ ముందు భాగంలో మైపాడురోడ్డు వరకు దాదాపు 40 అంకణాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని ఆక్రమించేసి ప్రహరీ నిర్మించారు. ఇదే ప్రాంతంలో ఉన్న దేవదాయ, ఇరిగేషన్ శాఖలకు చెందిన స్థలాలను ఆక్రమించి దుకాణాలు, ఇళ్లు నిర్మించారు. వీటిపై నేటికి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖాలు లేవు.
● తాజాగా నగర నడిబొడ్డున ఉడ్‌హౌస్‌సంఘంలోని రూ.2 కోట్ల విలువైన రోడ్డు స్థలాన్ని కొందరు ఆక్రమించి దుకాణాల నిర్మాణం చేపడుతున్నారు. ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న స్టోన్‌హౌస్‌పేట ప్రాంతం వాణిజ్య ప్రదేశం. ఇక్కడ నిత్యం రూ.కోట్లలో వ్యాపారాలు జరుగుతుంటాయి. స్టోన్‌హౌస్‌పేటకు అత్యంత సమీపంలో ఉన్న ఉడ్‌హౌస్‌సంఘం ప్రాంతంలో అంకణం దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఇంతటి ఖరీదైన ప్రాంతంలో సుమారు 20 అంకణాలకుపైగా రోడ్డు స్థలాన్ని కొందరు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో రోడ్డు నిర్మాణం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో స్టోన్‌హౌస్‌పేట ప్రధాన రహదారి నుంచి ఉడ్‌హౌస్‌సంఘంలోకి వెళ్లే ప్రధాన మార్గం ప్రారంభంలో రోడ్డు విస్తరణ చేపట్టారు. అక్కడ ఉన్న పలు ఆక్రమణలు తొలగించి వాహనాల రాకపోకలకు అనుకూలంగా ఉండేలా విశాలమైన సిమెంట్ రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ సిమెంట్ రోడ్డుకు పక్కనే ఉన్న పాతసిమెంట్ రోడ్డును కొందరు ఆక్రమించేసి దుకాణాలు నిర్మించారు. ఈ విషయమై స్థానికులు పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు. పరిశీలించిన న్యాయస్థానం ప్రభుత్వ రోడ్డులోని ఆక్రమణలను తొలగించేలా చర్యలు చేపట్టాలని కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు యంత్రాంగం స్పందిస్తూ 2024 జనవరి 20న మూడ్రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఎండార్స్‌మెంట్ సైతం ఇవ్వడం జరిగింది. అయినా నేటికీ ఎలాంటి చర్యలు లేవు. రోడ్డును ఆక్రమించి నిర్మించిన దుకాణాల వెనుక ఉన్న స్థల యజమాని తన భవన నిర్మాణం అనుమతి కోసం ఎన్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కూడా ప్రస్తుతం నిర్మించిన దుకాణాల స్థలం రోడ్డుగానే ప్లాన్‌లో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న సిటీ నియోజకవర్గంలో రోజురోజుకు ఇలా ప్రభుత్వానికి చెందిన స్థలాలు, రోడ్లు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణలను అడ్డుకుని ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మంత్రి నారాయణ ఇలాకాలో
రోడ్డును కబ్జా చేసి షాపుల నిర్మాణం
కోర్టు ఆదేశాలు బేఖాతరు
చోద్యం చూస్తున్న కార్పొరేషన్


