128 పొగాకు బేళ్ల విక్రయం | - | Sakshi
Sakshi News home page

128 పొగాకు బేళ్ల విక్రయం

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 128 పొగా కు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. వేలానికి 131 బేళ్లు రాగా 128 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. కిలోకు గరిష్ట ధర రూ.250 కాగా, కనిష్ట ధర రూ.190 లభించింది. సగటున రూ.222.84 ధర నమోదైంది. వేలంలో 8 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

పాత వాహనాల

కొనుగోలుకు ఈ–వేలం

నెల్లూరు (అర్బన్‌): జిల్లా వైద్యశాఖకు సంబంధించి మరమ్మతులకు గురై వినియోగానికి ఉపయోగపడని వివిధ రకాల 25 వాహనాలను ఈ–వేలం ద్వారా విక్రయించనున్నట్లు డీఎంహెచ్‌ఓ సుజాత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న హెచ్‌టీటీపీఎస్‌://కొనుగోలు.ఏపీ.జీఓవీ.ఇన్‌ అనే పోర్టల్‌ ద్వారా వాహనాల వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బిడ్డర్లు సంబంధిత పోర్టల్‌ను పరిశీలించి వివరాలు తెలుసుకోవాలని, క్రమం తప్పకుండా వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

జూన్‌ 5న వాయిదా పడిన ఇంటర్‌ పరీక్ష

నెల్లూరు (టౌన్‌): బక్రీద్‌ పండగను పురస్కరించుకుని ఈ నెల 28న జరగాల్సిన ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జూన్‌ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ వరప్రసాదరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 5న జరగాల్సిన ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వాల్యూ పరీక్ష 12న జరగనున్నట్లు వెల్లడించారు.

శ్రీవారి దర్శనానికి

24 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 79,603 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 45,125 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

మేం చెబుతాం..

ఆచరించం!

నో వెహికల్‌ ప్రైడే అమలెక్కడ?

ఆర్భాటంగా ఆనం కాన్వాయ్‌

ఆత్మకూరు: పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాన మంత్రి మొదలు, ముఖ్య మంత్రులు, మంత్రులు తమ కాన్వాయ్‌లో వాహనాలను కుదించుకున్న విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సైతం వారంలో ఒక రోజు శుక్రవారం ‘నో వెహికల్‌ ప్రైడే’ గా పాటించాలని నిర్ణయించారు. ప్రతి శుక్రవారం రోజు కాన్వాయ్‌ లేకుండా, వీలైతే బస్సుల్లో వెళ్లేలా మంత్రులు తమ షెడ్యూల్‌ మార్చుకోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆత్మకూరులో శుక్రవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్‌లో 11 వరకు కార్లు మున్సిపల్‌ పరిధిలో రయ్‌.. రయ్‌ అంటూ హడావుడిగా తిరిగాయి. దీన్ని చూసి పట్టణ ప్రజలు నో వెహికల్‌ ఫ్రైడే అమలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రజలకు చెప్పేందుకే పొదుపు నియమాలు అని, తమకు అవి వర్తించవని అమాత్యుల భావం కాబోలు.

కామాక్షితాయి ఆలయానికి రూ.10.30 లక్షల విరాళం

బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి దేవస్థానానికి నెల్లూరుకు చెందిన కొమ్మి మల్లికార్జుననాయుడు కుటుంబ సభ్యులు రూ.10,30,232 నగదును విరాళంగా శుక్రవారం అందజేశారు. ఎస్‌ఎస్‌ మోడరన్‌ రైస్‌ ఇండస్ట్రీ, లక్ష్మీవెంకటేశ్వర మోడరన్‌ రైస్‌ ఇండస్ట్రీ పేరుతో శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఈ విరాళాన్ని అందజేశారు. దాతలను ఆలయ చైర్మన్‌ తిరుమూరు అశోక్‌రెడ్డి, సహాయ కమిషనర్‌ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement