ఆర్టీసీకి భవిష్యత్‌ లేకుండా చేయడమే | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి భవిష్యత్‌ లేకుండా చేయడమే

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

26న చర్చలు ఉండగా.. ఈలోపే డిపోను పగలకొట్టడం దారుణం

సీఐటీయూ నాయకుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు

నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్‌ కంపెనీకి కట్టబెట్టి భవిష్యత్‌ లేకుండా చేస్తోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె అజయ్‌కుమార్‌ మండి పడ్డారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద డిపో 2 గ్యారేజీ వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. గ్యారేజీలోకి దూసుకెళ్లేందుకు సీఐటీయూ నాయకులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెందిన విలువైన స్థలాలను ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టే చర్యలు ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్రంలో 12 డిపోల స్థలాలను ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ బస్సు రూ.40 లక్షలుంటే.. కూటమి ప్రభుత్వం రూ.1.70 కోట్లతో ఒక్కో బస్సు కొంటున్నారన్నారు. గుంతలమయమైన రోడ్లులో ఎలక్ట్రిక్‌ బస్సులు తిప్పే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ప్రభుత్వం, అధికారులు పంతానికి పోయి ఇటు వంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. 103 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఈ నెల 26న చర్చలు ఉండగా డిపోలోని పలు భవనాలను పగలకొట్టేయడం దారుణమన్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులు కారణంగా సీ్త్ర శక్తి పథకం రద్దవుతుందని, విద్యార్థులకు బస్సు పాస్‌లు ఉండవన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై రానున్న రోజుల్లో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నాగేశ్వరరావు, శంకరయ్య, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement