నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వంలో నగరపాలక సంస్థ అధికారులు తీసుకుంటున్న చర్యల కారణంగా పేదలు ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరులో జాఫర్‌సాహెబ్ కెనాల్ రివిట్‌మెంట్ వాల్ నిర్మాణం పేరుతో మైపాడు రోడ్డుకు ఆనుకుని నివసిస్తున్న నిరుపేద కుటుంబాల ఇళ్లను ఖాళీ చేయించాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఖాళీ చేయకపోతే తామే తొలగిస్తామని హెచ్చరించడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మైపాడు రోడ్డులో ఇప్పటికే స్మార్ట్ స్ట్రీట్ బజార్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నివాసాలను తొలగించి అదే ప్రాంతంలో మరో స్మార్ట్ స్ట్రీట్ బజార్‌ను ఏర్పాటు చేయాలన్న యోచనతోనే ఈ చర్యలు చేపడుతున్నారనే ఆరోపణలున్నాయి.
భయాందోళనలో..
రోజువారీ కూలీ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. పని దొరికితేనే పూట గడిచే పరిస్థితిలో ఉన్న ప్రజలు ఇళ్ల తొలగింపు హెచ్చరికలతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు రెండు, మూడుసార్లు సందర్శించి, ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరించినట్లు తెలిసింది.
అక్కడే ఉంటూ..
నగరంలోని పాత చెక్‌పోస్ట్ నుంచి మైపాడు బీచ్‌కు వెళ్లే ప్రధాన మార్గమైన మైపాడు రోడ్డును గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు లేన్లుగా అభివృద్ధి చేశారు. అప్పటి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చొరవతో చేపట్టిన ఈ పనుల్లో భాగంగా కొంతమేర ఇళ్లను తొలగించినప్పటికీ, మిగిలిన ప్రాంతాన్ని యథావిధిగా వదిలేశారు. అప్పట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మిగిలిన ఇళ్లను తొలగించే ఉద్దేశం లేదని హామీ ఇవ్వడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అప్పట్నుంచి దాదాపు 80 కుటుంబాలు అక్కడే ఉంటున్నాయి.
కూటమి ప్రభుత్వం వచ్చాకే..
పాత చెక్‌పోస్ట్ నుంచి జాఫర్‌సాహెబ్ కాలువ, మైపాడు రోడ్డుకు మధ్యనున్న ఇరిగేషన్ స్థలంలో నివసిస్తున్న పేదలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అందిన సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని, ఇప్పుడు ఇళ్ల తొలగింపు భయం వెంటాడుతోందని చెబుతున్నారు. నగరంలో కాలువల స్థలాలను ఆక్రమించి పెద్ద భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకుండా, తమలాంటి నిరుపేదలపై మాత్రమే అధికారులు దృష్టి సారించడం అన్యాయమని మండిపడుతున్నారు.
80 ఏళ్లుగా ఇక్కడే జీవనం
ఈ ప్రాంతంలో దాదాపు 80 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సుమారు 80 కుటుంబాలున్నాయి. సుమారు 400 మందికి పైగా ఉంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలి? మా బతుకులు రోడ్డున పడతాయంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాఫర్‌సాహెబ్ కెనాల్‌కు రివిట్‌మెంట్ గోడ నిర్మించాల్సి వస్తే అవసరమైన స్థలం మాత్రమే వినియోగించి, మిగిలిన ప్రాంతాన్ని తమకే అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందులోనే చిన్న గుడిసెలు వేసుకుని జీవిస్తామంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
జాఫర్‌సాహెబ్ కాలువ వెంబడి ఇళ్లు తొలగించేందుకు సిద్ధం
ఖాళీ చేయకుంటే తామే
తొలగిస్తామంటూ బెదిరింపులు
ఎట్టి పరిస్థితుల్లో కదిలేది
లేదంటున్న ప్రజలు
కెనాల్ రివిట్‌మెంట్ వాల్‌కు పోను
మిగిలిన స్థలం అప్పజెప్పాలని డిమాండ్
ఒక్కసారిగా తొలగిస్తే మా బతుకులు ఏం కావాలని ఆగ్రహం
కార్పొరేషన్ అధికారుల చర్యలతో
ఆందోళన


