● కూటమి ప్రభుత్వం వచ్చాక పెరిగిన కబ్జాలు
● హెచ్చరిక బోర్డులు మాయం
● రీ సర్వేలో పేర్ల నమోదుకు ప్రయత్నాలు
● ఆక్రమణ చెరలో వందల ఎకరాలు
చిల్లకూరు: మండలంలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామమైన కడివేడులో ప్రభుత్వ భూముల ఆక్రమణలు రోజురోజుకూ పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు భూములను ఆక్రమించుకుని హద్దులు ఏర్పాటు చేసుకోవడం, రీ సర్వే సమయంలో పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రయత్నాలు చేయడం, గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మాయం కావడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని విమర్శలున్నాయి. ఒకవైపు రెవెన్యూ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుడతామని, భూములను ఏపీఐఐసీకి కేటాయిస్తామని చెప్పడమే ఆలస్యం.. మరోవైపు ప్రభుత్వ భూములపై అక్రమ దందాలు కొనసాగుతున్నాయని ఆరోపణలున్నాయి.
అక్రమార్కులకు అవకాశం
కడివేడు రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని విస్తారంగా ప్రభుత్వ భూములున్నాయి. సుమారు 20 ఏళ్ల క్రితం భూ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులపై అప్పట్లో ఏసీబీ అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత సంబంధిత భూముల రికార్డులు తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారిందని ప్రచారం జరుగుతోంది. దీంతో కొంతమంది బడాబాబులు రెవెన్యూ సిబ్బంది కుమ్మకై ్క ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టించుకుని సాగు చేసుకోవడం, క్రయవిక్రయాలు జరుపుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
బోర్డులు పెడితే..
గతంలో కొందరు తహసీల్దార్లు ప్రభుత్వ భూములపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పలు సర్వే నంబర్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కింది స్థాయి సిబ్బంది సహకారంతో ఆ బోర్డులు తొలగించబడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆక్రమణదారులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు.
రూ.కోట్ల విలువ
మండలంలోని బూదనం టోల్‌ప్లాజా సమీపంలో ఎకరా భూమి విలువ రూ.3 కోట్ల వరకు పలుకుతోంది. ఈ ప్రాంతంలోని సర్వే నంబర్ 953లో సుమారు 17.24 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే సుమారు 14 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మరో మూడు ఎకరాలకు ఫెన్సింగ్ వేసి సాగుకు సిద్ధం చేయగా స్థానికుల ఫిర్యాదుతో అప్పటి తహసీల్దార్ విచారణ జరిపి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఆ బోర్డును తొలగించి రీ సర్వే జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారుల సహకారంతో సుమారు రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి.
సర్వే నంబర్ 954లో ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు (ఫైల్)
నేడు హెచ్చరిక బోర్డును తీసేశాక..
విచారణ చేపడతాం
కడివేడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీకి అప్పగించే ప్రక్రియలో భాగంగా రికార్డులు పరిశీలిస్తున్నాం. అలాగే సర్వే నంబర్ 953లో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును ఎవరు తొలగించారు?, వారి పేర్లు రికార్డుల్లో నమోదయ్యాయా అనే అంశాలపై విచారణ చేపడతాం. – గోపీనాథ్‌రెడ్డి, తహసీల్దార్


