వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో పలువురికి పదవులు

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ పదవుల్లో నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్‌ టీయూ రాష్ట్ర సెక్రటరీగా నెల్లూరు నగర నియోజకవర్గానికి చెందిన మండేటి వెంగళరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఎంప్లాయీస్‌, పెన్షనర్ల వింగ్‌ ప్రెసిడెంట్‌గా కె.నారాయణరెడ్డి నియమితులయ్యారు.

స్పోర్ట్స్‌ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(టౌన్‌): కడపలోని డా.వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ స్కూల్లో 2026 – 27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్‌. జసీమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వారు వచ్చేనెల 2వ తేదీలోపు https://apsports school.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 4వ తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలు, 5వ తరగతిలో ఆరుగురు బాలురు, 17 మంది బాలికలు, 6వ తరగతిలో నలుగురు బాలురు, 8 మంది బాలికలకు ఖాళీలు ఉన్నాయన్నారు. అదే విధంగా 7వ తరగతిలో 8 మంది బాలురు, 15 మంది బాలికలు, 8వ తరగతిలో ముగ్గురు బాలురు, 5 మంది బాలికలు, 9వ తరగతిలో 16 మంది బాలురు, 10 మంది బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, ఫుట్‌బాల్‌, హాకీ క్రీడల్లో శిక్షణ అందిస్తారన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన విద్యార్థులకు మోటార్‌ ఎబిలిటీ టెస్టులు నిర్వహించి, రాష్ట్రస్థాయి ఎంపికల్లో వైద్య పరీక్షల ద్వారా శారీరక దృఢత్వాన్ని అంచనా వేస్తారని తెలిపారు. ఇతర వివరాల కోసం 88862 28444 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

దువ్వూరు మరణం

పార్టీకి తీరనిలోటు

సూళ్లూరుపేట: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దువ్వూరు మునిశేఖర్‌రెడ్డి అకాల మరణం పార్టీకి తీరనిలోటని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కాకాణితోపాటు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, నియోజకవర్గ కన్వీనర్‌ కిలివేటి సంజీవయ్య, నాయకులు పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చేరుకున్నారు. మునిశేఖర్‌రెడ్డి పార్థివ దేహంపై పార్జీ జెండాను కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ మునిశేఖర్‌రెడ్డి పార్టీకి అంకితభావంతో పనిచేశారని చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ జగనన్నను మళ్లీ సీఎంగా చూడాలన్నదే తన జీవిత లక్ష్యమని దువ్వూరు చెప్పేవారన్నారు. సంజీవయ్య మాట్లాడుతూ మునిశేఖర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూనే పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వహించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement