● జాయింట్ కలెక్టర్ ఎదుట ప్రజల ఆగ్రహం
● పోలీసులను పిలుస్తానంటూ హెచ్చరికతో
గందరగోళం
● ఖాళీ కుర్చీలతో వెలవెలబోయిన సభ
వాకాడు: ‘ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు.. మళ్లీ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు?’ అంటూ తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోవిందరావును అర్జీదారులు నిలదీశారు. దీంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. వాకాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం వాకాడు, చిట్టమూరు మండలాలకు సంబంధించిన ‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని జేసీ, సూళ్లూరుపేట ఆర్డీఓ దేవేందర్‌రెడ్డి నిర్వహించారు. దీనికి ముందస్తు సమాచారం లేకపోవడంతో అర్జీదారులు పెద్ద సంఖ్యలో హాజరుకాలేదు. ఫలితంగా సభ ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. గతంలో ఇచ్చిన రెవెన్యూ క్లినిక్ అర్జీలకు ఇప్పటికీ పరిష్కారం రాలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మళ్లీ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. ఓ బీజేపీ నాయకుడు సమావేశ బ్యానర్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఫొటో లేకపోవడంపై ప్రశ్నించగా.. జేసీ పోలీసులను పిలవాలంటూ ఆదేశించడంతో గందరగోళం నెలకొంది. దీనిపై బీజేపీ నాయకులు స్పందిస్తూ.. ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరించడం సరికాదని, రెవెన్యూ సమస్యలు పరిష్కరించకపోవడంపై ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఫిర్యాదులకు అధికారులు స్పందించేవారని, ప్రస్తుతం సమస్యలు పెండింగ్‌లోనే ఉంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో వాకాడు, చిట్టమూరు తహసీల్దార్లు సయ్యద్ ఇక్బాల్, రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


