నెల్లూరు(టౌన్): జిల్లాలోని వివిధ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. గత నెలలోనే వాటిని పంపిణీ చేశారు. సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శుక్రవారం నెల్లూరులోని కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 12 కేజీబీవీలు, 11 మోడల్ హైస్కూల్స్, 46 పీఎంశ్రీ స్కూల్స్ ఉన్నాయన్నారు. ప్రతి దాంట్లో రెండు ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. ఒక్కో యూనిట్‌కు జీఎస్టీతో కలిపి రూ.2.66 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. పీఎంశ్రీ స్కూల్స్‌కు సంబంధించిన మొత్తం ఖర్చును కేంద్రం, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్‌కు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం అందిస్తుందన్నారు. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ప్యానెల్స్‌ను అమర్చి వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇంకా పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘సిక్ రూమ్’లను ఏర్పాటు చేస్తామన్నారు. వాటిల్లో మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి కేజీబీవీ, మోడల్ స్కూల్లో 9 చొప్పున, 46 పీఎం శ్రీ స్కూల్స్‌లో 317 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారన్నారు.


