రాష్ట్రంలో అరుదుగా లభించే సిలికా ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక టీడీపీ నాయకులు చిల్లకూరు, కోట మండలాల్లోని కాలం చెల్లిన, అనుమతులు పూర్తయిన సిలికా గనులపై కన్నేశారు. సిండికేట్‌గా మారి సెలవు దినాల్లో, రాత్రి వేళల్లో యంత్రాలతో | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరుదుగా లభించే సిలికా ఖనిజ సంపదను కొల్లగొడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక టీడీపీ నాయకులు చిల్లకూరు, కోట మండలాల్లోని కాలం చెల్లిన, అనుమతులు పూర్తయిన సిలికా గనులపై కన్నేశారు. సిండికేట్‌గా మారి సెలవు దినాల్లో, రాత్రి వేళల్లో యంత్రాలతో

May 22 2026 12:12 AM | Updated on May 22 2026 12:12 AM

చిల్లకూరు: కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు బ్రహ్మ రాక్షసుల్లా మారి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోని ఖనిజ సంపదను లూటీ చేస్తున్నారు. సిలికా, తెల్లరాయికి మంచి గిరాకీ ఉండడంతో సిండికేట్‌గా మారి ప్రభుత్వ పెద్దల అండదండలతో అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ప్రభుత్వ భూముల్లోని సిలికాను పిడికెడు కూడా తరలించడం లేదని చెబుతూనే కాలం చెల్లిన, అనుమతులు పూర్తయిన సిలికా గనులను లక్ష్యంగా చేసుకుని అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. రోజుకో మైన్‌లో 10 నుంచి 20 లారీల సిలికా (ఒక లారీకి సుమారు 50 టన్నులు)ను అక్రమ మార్గంలో తరలిస్తున్నారు. అయినా గనుల శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి

రాష్ట్రంలో అరుదైన సిలికా ఖనిజం చిల్లకూరు, కోట మండలాల్లోని తీర ప్రాంతంలో సుమారు ఆరు వేల హెక్టార్లలో లభిస్తోంది. ఈ ఖనిజానికి పరిశ్రమల్లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రధానంగా గాజు, ఉక్కు పరిశ్రమల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో పలువురు సిలికా గనులను లీజుకు తీసుకుని పరిశ్రమలు అధికంగా ఉండే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, తెలంగాణకు ఎగుమతి చేస్తుంటారు.

ప్రకృతి విధ్వంసం.. భూగర్భ జలాలు పాతాళం

గూడూరు నియోజకవర్గంలోని ఖనిజ సంపదపై స్థానిక టీడీపీ నాయకులు దృష్టి పెట్టారు. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని సిండికేట్‌గా ఏర్పడ్డారు. తెల్లరాయి, సిలికా ఖనిజాలతోపాటు గ్రావెల్‌, మట్టిని అక్రమంగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అక్రమ తవ్వకాలతో ప్రకృతిని విధ్వంసం చేస్తుండడంతో భారీగా ఏర్పడిన గుంతల్లో పడి పశువులు, మనుషులు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నెలకొంది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా సుమారు 30, 40 అడుగుల లోతు మేర తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఫలితంగా రైతులు, సమీప గ్రామాల ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అంతా మా ఇష్టం అని సిండికేట్‌ బెదిరింపులకు పాల్పడుతోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

సిలికా తవ్వకాలతో ప్రభుత్వానికి వచ్చే రాయల్టీ నేడు తక్కువై పోయింది. రాష్ట్రంలో అన్ని రకాల ఖనిజ సపదకు చెందిన రాయల్టీలను వసూలు చేసి చెల్లించేలా ఒకే కాంట్రాక్ట్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే గతంలో ప్రభుత్వానికి మైన్ల లీజుదారులు చెల్లించే రాయల్టీ కన్నా నేడు తక్కువగా ఆదాయం వస్తున్నట్లుగా తెలుస్తోంది. చిల్లకూరు, కోట మండలాల్లోని సిలికా గనుల నుంచి గతంలో నెలకు మూడు లక్షల టన్నులకుపైగా సిలికా రవాణా అయ్యేది. దీంతో ప్రభుత్వానికి నెలకు సుమారు రూ.9 కోట్లకు పైగా రాయల్టీ వచ్చేది. ప్రస్తుతం కాంట్రాక్ట్‌ దక్కించుకున్న సంస్థతో పాటు సిండికేట్‌ ద్వారా అందులో సగం మాత్రమే రాయల్టీ కింద జమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన మొత్తం ప్రభుత్వంలోని పెద్దల జేబుల్లోకి వెళుతుందునే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా కోట్ల రూపాయలు సొమ్ము పరులపరం కావడం కూటమి ప్రభుత్వంలోని మిగిలిన నాయకులకు కూడా మింగుడు పడడం లేదు.

కాలం చెల్లిన సిలికా గనుల్లో అక్రమ తవ్వకాలు

సిండికేట్‌గా మారిన టీడీపీ నాయకులు

పెద్దల అండదండలతో

పరిశ్రమలకు తరలింపు

ప్రభుత్వ ఆదాయానికి గండి

కన్నెత్తి చూడని గనుల శాఖాధికారులు

సరెండర్‌ చేసిన గనుల్లోనూ..

సుమారు 50 ఏళ్ల క్రితం లీజుకు తీసుకున్న సిలికా గనులు కోట, చిల్లకూరు మండలాల్లో సుమారు పది వరకు ఉన్నాయి. వాటిల్లో తవ్వకాలు పూర్తవడంతో రెన్యూవల్‌ చేసుకోకుండా యాజమాన్యాలు ప్రభుత్వానికి తిరిగి అప్పగించే క్రమంలో ఐదేళ్ల క్రితం సరెండర్‌ చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సిలికా సిండికేట్‌గా ఏర్పడిన అధికార పార్టీ పెద్దలు సరెండర్‌ చేసిన గనుల్లోని సిలికాపై కన్నేశారు. అనుకున్నదే తడువుగా రాత్రి వేళలు, సెలవు దినాల్లో పెద్ద పెద్ద యంత్రాలతో అక్రమంగా తవ్వకాలు చేపట్టి ఇతర రాష్ట్రాలకు తరలించి లక్షలు గడిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement