ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

May 22 2026 12:12 AM | Updated on May 22 2026 12:12 AM

నెల్లూరు(టౌన్‌): వెంకటేశ్వరపురంలోని ప్రభు త్వ బాలికల ఐటీఐలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆయా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్‌ ఏడుకొండలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానిక్‌, ఇన్‌స్ట్రూమెంట్‌ మెకానిక్‌, రిఫ్రిజిరేషన్‌,ఎయిర్‌కండీషన్‌ టెక్నీషియస్‌, డ్రస్‌మేకింగ్‌, తదితర ట్రేడ్‌ల్లో అడ్మిషన్లు ఉన్నాయని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 30వ తేదీలోగా itiadmissions. ap. gov. in/ iti వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌

పోటీల ప్రారంభం

నెల్లూరు (టౌన్‌): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శాప్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే జసీమ్‌ గురువారం ప్రారంభించారు. అండర్‌–16, 20 విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక చేయనున్నారు.

11 మంది నర్సింగ్‌

విద్యార్థినులకు అస్వస్థత

వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్‌ వద్ద ఉన్న ఓ నర్సింగ్‌ కళాశాలలో చదువుతున్న 11 మంది విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఉదయం 10 గంటలకు ముగ్గురు విద్యార్థినులు వాంతులు, తలనొప్పితో అస్వస్థతకు గురికాగా వెంకటాచలంలోని క్లస్టర్‌ ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం మరో ముగ్గురు, సాయంత్రం మరి కొందరు మొత్తంగా 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై సీహెచ్‌సీకు రాగా వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో కళాశాలలోని మిగిలిన విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ షేక్‌ అబ్దుల్‌ మొయిన్‌ మాట్లాడుతూ విద్యార్థినులు డీహైడ్రేషన్‌తో సీహెచ్‌సీకు వచ్చారని, చికిత్స అందిస్తున్నామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కొండాపురం ఎస్సైపై

సస్పెన్షన్‌ వేటు

కొండాపురం : కొండాపురం ఎస్సై జే మాల్యాద్రిని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారని కలిగిరి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బారావు గురువారం తెలిపారు. ఇటీవల కొండాపురంలో ఓ వ్యక్తిపై పెట్రోల్‌ పోసి టీడీపీ నాయకులు చంపేశారన్న విషయం, నాలుగు రోజుల క్రితం గానుగపెంటకు చెందిన ఇద్దరు దళితులపై కొమ్మి గ్రామానికి చెందిన వ్యక్తులు దాడి చేసి ఓ వ్యక్తిని చంపి బావిలో పడవేసిన కేసుల విషయంలో ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెన్షన్‌ విధించారని వివరించారు.

ఎస్‌బీఐ సేవలకు నాలుగు

రోజులు అంతరాయం

నెల్లూరు(అర్బన్‌): స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సేవలకు వరుసగా నాలుగు రోజులు అంతరాయం కలుగనుంది. ఈ నెల 23న నాల్గో శనివారం, 25న ఆదివారం సెలవు దినాలు కావడంతో బ్యాంకు ఉండదు. కాగా తమ డిమాండ్ల సాధనకోసం ఎస్‌బీఐ ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో బంద్‌కు పిలుపునిచ్చి ఉన్నారు. దీంతో ఈ రెండ్రోజుల్లో కూడా బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనుంది. బక్రీద్‌ సందర్భంగా ముందస్తు క్యాలెండర్‌ ప్రకారం ప్రభుత్వం ఈ నెల 27న సెలవు దినాన్ని ప్రకటించింది. అయితే ముస్లిం పెద్దలు పండగను ఈ నెల 28న జరుపుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ నెల 28న సెలవు ప్రకటించింది. దీంతో శనివారం నుంచి వరుసగా నాలుగు రోజులు, ఆ తర్వాత గురు వారం మరో రోజు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. అందువల్ల ఖాతా దారులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement