● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: తుమ్మలపెంట పర్యటనలో చంద్రబాబును కలవనీయకుండా చెన్నాయపాళేనికి చెందిన మత్స్యకార మహిళలను పోలీసులు నిర్బంధించడం అన్యాయమని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాకుటూరు, తాటిపర్తిపాళెం గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన మత్స్యకార మహిళలను పోలీసులు అడ్డుకోవడంపై వారు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. ముందుగా ఎంపిక చేసిన కొందరు మత్స్యకారులను మాత్రమే నిఘా నీడలో, పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబును కలిసేలా ఆంక్షలు విధించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ భూ సమస్యలను సీఎంకు చెప్పుకుందామని వస్తే పోలీసులు కలవనీయకుండా అడ్డుకోవడం సరైన పద్ధతికాదన్నారు. చంద్రబాబుకు చెప్పుకుంటే తమకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో వచ్చిన మహిళలకు నిరాశే మిగిలిందన్నారు. చంద్రబాబు చేపల కూర వండటం, వడ్డించడం, ఆరగించడంపై జనం సైటెర్లు వేస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, మత్స్యకారులను ఆకట్టుకునే ఆకర్షణీయ పథకాలు ప్రకటించకుండా చేపల వంట పేరుతో డ్రామాలాడి అభాసుపాలయ్యాడన్నారు. ఆయన తన పర్యటన ఆద్యంతం ప్రజల సమస్యల గురించి కాకుండా, వైఎస్ జగన్‌ని, వైఎస్సార్‌సీపీని దుమ్మెత్తి పోయడానికే ప్రాధాన్యత ఇచ్చాడన్నారు. చంద్రబాబు మత్స్యకారుల సేవలో పేరుతో తుమ్మలపెంట గ్రామానికి వచ్చి తాను ఏమి చేశాడో చెప్పుకోలేక రకరకాల విన్యాసాలతో నవ్వుల పాలయ్యాడని విమర్శించారు. కొత్త స్టీల్ సామగ్రితో మత్స్యకారుల ఇంట వంటా, వడ్డింపు పేరుతో చంద్రబాబు తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారన్నారు. టీడీపీ విడుదల చేసిన వీడియోలు చూస్తుంటే మత్స్యకారుల ఇంట్లో వాళ్లు వాడే వస్తువులను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడ లేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలు చాలా సంతోషంగా చెబుతున్నారన్నారు. కాకుటూరులో టీడీపీ నాయకులు ఆక్రమించుకున్న భూమిని ఖాళీ చేయించి 283 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే గృహ నిర్మాణాలను ప్రారంభించడం జరిగిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులకు బిల్లులు చెల్లించక నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి అవినీతిలో మునిగితేలుతోందని ఆరోపించారు. చంద్రబాబు మాటల గారఢీతో రకరకాల డ్రామాలతో తమను మభ్యపెడుతున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబును గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.


