బిట్రగుంట: టీడీపీ నాయకులు సామాజిక మాధ్య మాల్లో దిగజారుడు రాతలను పోస్టు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బతికుండగానే కాలం చేశారని తప్పుడు కథనాలను పోస్టు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కావలి నియోజకవర్గంలోని పలు వాట్సప్ వార్తా గ్రూపులు, ఇతర వాట్సప్ గ్రూపుల్లో బుధవారం అర్ధరాత్రి సుమారు 12.30 గంటల ప్రాంతంలో ‘వై సాయిరాం’ అనే వాట్సప్ డిస్‌ప్లే పేరుతో ఉన్న 79950 36322 నంబరు నుంచి వైఎస్సార్‌పీపీ మండలాధ్యక్షుడు మద్దిబోయిన వీరరఘు కాలం చేశారనే తప్పుడు కథనాలను పోస్టు చేశారు. రఘు ఫొటోతో పాటు ‘జోహార్ రఘు అన్న’ అంటూ వరుసగా కథనాలు పోస్టు చేయడంతో రఘు బంధువులు, మిత్రులు, నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి సమయం కావడంతో అందరూ ఫోన్లు చేసి ఆరా తీయడం ప్రారంభించారు. చివరకు తప్పుడు కథనంగా తేలడం, దురుద్దేశపూర్వకంగా రఘు పేరు, ఫొటోను దుర్వినియోగం చేస్తూ కాలం చేశారనే కథనా న్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినట్లు గుర్తించారు. దీంతో తీవ్రంగా కలత చెందిన రఘు బంధుమిత్రులు, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, విశ్వనాథరావుపేట బిట్–2 ఎంపీటీసీ సభ్యులు ఏకే సుందర్‌రాజు గురువారం సాయంత్రం బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్లో భయాందోళనలు కలిగించేలా బతికి ఉన్న వ్యక్తిని చనిపోయినట్లుగా తప్పుడు ఫొటోలతో ప్రచారం చేసిన సదరు వ్యక్తిపై బీఎన్‌ఎస్, ఐటీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం
వీరరఘుపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన ఘటనపై స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో పాటు బోగోలు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావలి కేంద్రంగా అధికార పార్టీని అడ్డం పెట్టుకుని కొన్ని యూట్యూబ్ చానళ్లు, సామాజిక మాధ్యమాల్లో దిగజారుడు కథనాలతో పైశాచిక ఆనందం పొందుతున్న ముఠాలపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రఘుపై అనుచిత కథనాలు పోస్టు చేసిన వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టకుంటే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో దిగజారుడు రాతలు
బోగోలు మండలాధ్యక్షుడు రఘు కాలం చేశారని తప్పుడు కథనాలు పోస్టు
పోలీసులకు ఫిర్యాదు చేసిన
వైఎస్సార్‌సీపీ నాయకులు


