ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

May 22 2026 12:12 AM | Updated on May 22 2026 12:12 AM

నెల్లూరు (టౌన్‌): ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 4946 మంది హాజరుకావాల్సి ఉండగా, 4,668 మంది హాజరయ్యారు. 278 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌కు సంబంధించి 98 మందికి గాను, 88 మంది హాజరయ్యారు. 10 మంది గైర్హాజరయ్యారు. మధ్యా హ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 2,112 మంది హాజరుకావాల్సి ఉండగా, 1893 మంది హాజరయ్యారు. 219 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 67 మందికి గాను, 59 మంది హాజరయ్యారు. ఆర్‌ఐఓ ఏడు కేంద్రాలు, డీవీఈఓ 4, స్క్వాడ్‌ 30 కేంద్రాలను తనిఖీ చేశారు.

గంట ముందుగా పరీక్ష కేంద్రంలోకి

ఇంటర్మీడియట్‌ విద్యార్థులను పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రంలోకి పంపించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కేంద్రాల వద్దకు రావడంతో సందడిగా మారింది. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. కేంద్రాల సమీపంలోని చెట్లు కింద సేద తీరారు. పరీక్షలు జరిగే సమయంలో పలు కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడంతో విద్యార్థులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు.

28న పరీక్ష వాయిదా

బక్రీద్‌ సందర్భంగా ఈ నెల 28న జరగాల్సిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షను వాయిదా వేసినట్లు ఆర్‌ఐఓ వరప్రసాదరావు గురువారం తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎకనామిక్స్‌, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మ్యాఽథమెటిక్స్‌ పరీక్ష జరగాల్సి ఉందన్నారు. మళ్లీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement