చిల్లకూరు: గూడూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్, అర్బన్ హెల్త్ సెంటర్లను ఈ నెల 17న ప్రారంభించారు. ఆ సమయంలో ఆవిష్కరించిన శిలాఫలకంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పేరును విస్మరించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై ‘సాక్షి’లో సోమవారం కథనం రావడంతో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తాను చేసిన పొరపాటును సరిద్దికునేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి రెండు చోట్ల తిరుపతి ఎంపీ పేరుతో కొత్త శిలాఫలకాలను ఏర్పాటు చేయించారు.
డీసీపల్లిలో 75
పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం 75 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. వేలానికి 108 బేళ్లు రాగా, 75 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు చెప్పారు. వేలంలో కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.200, సగటున రూ.222.01 ధర లభించిందని తెలిపారు. వేలంలో 8 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
గోనుపల్లిలో
కలెక్టర్ పల్లె వీక్షణ నేడు
నెల్లూరురూరల్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేపట్టిన పల్లె వీక్షణ కార్యక్రమాన్ని రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో గురువారం నిర్వహించనున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ఉపాధి పనులు, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, రైతుసేవా కేంద్రాలను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలపై కలెక్టర్ ఆరా తీయనున్నారు. ఇంటింటి చెత్త సేకరణపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఓహెచ్‌ఆర్ ట్యాంకును పరిశీలించనున్నారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని, ఫిర్యాదులను స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
314 మంది గిరిజనులకు వెట్టిచాకిరి నుంచి విముక్తి
కావలి రూరల్: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఇటుక బట్టీల వద్ద వెట్టిచాకిరి చేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన యానాదులకు అధికారులు విముక్తి కల్పించారు. బుధవారం తెలంగాణ నుంచి జిల్లాకు చెందిన 314 మంది యానాదులను కావలి మండలం తుమ్మలపెంటలోని రెసిడెన్షియల్ స్కూల్ వద్దకు తీసుకొచ్చారు. జిల్లా జడ్జి, రెవెన్యూ అధికారులు, పోలీస్, తదితర శాఖల అధికారులు వచ్చి గిరిజనుల వివరాలను సేకరించారు. అనంతరం వారిని ఐదు బస్సుల్లో స్వగృహాలకు తరలించారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మరి కొంత మంది వలస కార్మికులు ఉన్నారని, వారిని కూడా తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాసులు, కావలి జడ్జి ఈ సుధాకర్, కావలి ఆర్డీఓ డీ ఎలీషాకుమార్, డీఎస్పీ డీవీ రమణ తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, లోక్‌అదాలత్ సభ్యుడు మాలకొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 84,315 మంది స్వామిని దర్శించుకున్నారు. 43,032 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.74 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు.


