మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఉదయగిరి: కేంద్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై బూత్‌లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. దుత్తలూరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డితో కలిసి కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ పేరుతో అధికార పార్టీ ఓట్లు తొలగించేందుకు కుట్రలు పన్నే అవకాశం ఉందన్నారు. అందువల్ల బీఎల్‌ఏలు ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఐర్ చేపట్టేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా నియోజకవర్గ ఇన్‌చార్జిలతో పాటు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాలని సూచించారు. అధికారంలోకి వస్తే ఇంధన ధరలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు వచ్చాక ఇంకా పెంచడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేస్తున్న వ్యాట్‌ను తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలన్నారు. పెట్రో ధరలతో ప్రజలు గగ్గోలుపెడుతుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు జిల్లా పర్యటనలో మత్స్యకార కుటుంబాలకు ఎటువంటి లబ్ధి చేకూర్చకపోగా కేవలం డ్రామాలతో సరిపెట్టారని విమర్శించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణను నిరసిస్తూ మత్స్యకారులకు భరోసాగా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తే చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. చంద్రబాబు ప్రసంగంలో తమిళనాడు బోట్ల దొంగతనం ప్రస్తావన లేకపోవడంతో మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందన్నారు. సాగర్ డిఫెన్స్‌తో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేస్తూ చంద్రబాబు ప్రకటన చేస్తారని భావించారని, అలా జరగకపోవడంతో మత్స్యకారులు తీవ్రనిరాశకు గురయ్యారన్నారు. రాష్ట్రంలో కూటమి పాలన అధ్వానంగా ఉందని, దీనిని దించేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాగా కొంతమంది పోలీసు అధికారులు ఓవరాక్షన్ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాకాణి దృష్టికి తీసుకురాగా తప్పుచేసిన అధికారులను, అతిగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భరోసా ఇచ్చారు.


