● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కోవూరు : క్షేత్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ బలోపేతమే లక్ష్యంగా నూతన గ్రామ, వార్డు కమిటీలు పనిచేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం పట్టణ, రూరల్‌కు సంబంధించిన నూతన వార్డు, గ్రామ కమిటీల సభ్యులతో బుధవారం ఆయన నెల్లూరులోని తన నివాసంలో సమావేశమై పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నాయకులు అందుబాటులో ఉండి సేవాభావంతో పనిచేయాలన్నారు. మండల, నగర కమిటీలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్‌బాబు, ఏపీఎల్‌డీఏ మాజీ చైర్మన్ గొల్లపల్లి విజయ్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


