కావలి: తమ భూ సమస్యలను సీఎం చంద్రబాబుకు విన్నవించేందుకు సభా ప్రాంగణం వద్దకు వస్తుంటే ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి పోలీసులతో నిర్బంధించారని చెన్నాయపాళేనికి చెందిన మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కావలిలోని జర్నలిస్టు క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను కొంతమంది ఆక్రమించుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా న్యాయం చేయలేదని వాపోయారు. ఈ విషయమై సీఎంను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు బలవంతంగా ఆపి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంను కలవనీయకపోయిన ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ మత్స్యకారులు తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో మంచిపద్ధతి కాదన్నారు.


